అనకాపల్లి: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు మనందరమూ రుణపడి ఉండాలని, మన స్వేచ్ఛకోసం వారు పాటుపడుతున్నారని సినీ హీరో సుమన్ అన్నారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న రెండో దక్షిణ భారత్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ డీవీఆర్‌కప్–2022 పోటీల్లో విజేతలకు శుక్రవారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ త్వరలోనే కరాటే అకాడమీని ప్రారంభిస్తానన్నారు. కరాటే ఆత్మరక్షణ కోసమే కాదని, వ్యాయామంగానూ పరిగణించాలన్నారు. ఇటువంటి క్రీడా పోటీలకు తానెప్పుడూ సహకరిస్తానన్నారు. నిర్వాహకుడు కాండ్రేగుల శ్రీరాంను అభినందించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పురుషులతోపాటు మహిళలూ స్వీయరక్షణ కోసం కరాటే శిక్షణ పొందాలన్నారు. దిశ వంటి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లిలో నిర్వహించిన పోటీలు విజయవంతమయ్యాయని తెలిపారు.
ఓవరాల్ చాంపియన్ ఏపీ...
ఐదు రాష్ట్రాలు పాల్గొన్న ఓపెన్ కరాటే పోటీల్లో చాంపియన్‌షిప్‌ను ఏపీ జట్టు కైవసం చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులకు సినీ హీరో సుమన్, ఎంపీ సత్యవతి, దాడి రత్నాకర్ బహుమతులు అందజేశారు. సినీ నటుడు ప్రసన్నకుమార్, కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కర్, పీలా లక్ష్మీసౌజన్య రాంబాబు, నేషనల్ బాడీబిల్డర్ శిలపరశెట్టి బాబీ, డాక్టర్ విష్ణుమూర్తి, డి.ఈశ్వరరావు, కోరిబిల్లి పరి, భీశెట్టి కృష్ణ అప్పారావు పాల్గొన్నారు.
అనకాపల్లి విద్యార్థికి రజత పతకం
అనకాపల్లి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో దక్షిణ భారత ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో అండర్–10 కేటగిరీ విభాగంలో పి.వరుణ్‌సూర్యదేవ్ రజత పతకాన్ని సాధించాడు. పట్టణంలో ఏడీ పాఠశాలలో చదువుతున్న బాలుడిని పాఠశాల డైరెక్టర్ అనూషసుబ్రహ్మణ్యం శుక్రవారం అభినందించారు. (క్లిక్: సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం)
Comments
Please login to add a commentAdd a comment