
సాక్షి, తాడేపల్లి: బుడమేరు వరదపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సంచలన కామెంట్స్ చేశారు. రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. వరద వస్తుందని మా అధికారులకు ముందే తెలుసు. కానీ, వారిని అక్కడి నుంచి తరలించే చర్యలు తీసుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వరద వస్తుందని మాకు ముందే తెలుసు. కానీ, రెండు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది అసాధ్యమైన ప్రక్రియ. 35వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని చెబుతారు. అలాంటి సమస్య బుడమేరు దగ్గర ఎదురైంది. ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. ఇదే సమయంలో బుడమేరుకు గండ్లు పడుతాయన్న సంగతి మాకు తెలియదు. వదరల తర్వాత 24/7 అప్రమత్తంగానే ఉన్నాం.
సింగ్ నగర్ ఇంకా వరద నీటిలోనే ఉంది. బుడమేరు గండ్లను జలవనరుల శాఖ వారు పూడ్చారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్‌బీ రోడ్లకు భారీగా గండ్లు పడ్డాయి. తొమ్మిదో తేదీ నుండి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తాం. ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలి. వరద వలన చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ, తొమ్మిదో తేదీ నుండి మీరు మీ ఇళ్ల దగ్గరే ఉండాలి’ అని తెలిపారు.