
బుడమేరు వరదలో మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ సంస్థల ఝలక్
చంద్రబాబు చెప్పే మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు
కంపెనీలతో మాట్లాడేశానన్న మాటలు ఆచరణ కాని వైనం
వరద బాధితుల్ని పట్టించుకోని బీమా కంపెనీలు
వరదవల్ల దెబ్బతిన్న వాహనాలకు బీమా సంస్థల కొర్రీలు
మరమ్మతులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల ఖర్చు
రూ.5 వేల లోపే ఇస్తామంటున్నారని వాహన యజమానుల గగ్గోలు
సాక్షి, అమరావతి : ‘నా ఆటో వరదలో మునిగి వారం రోజులు ఉండిపోయింది. అన్ని భాగాలు పాడైపోయాయి. ఇంజిన్ సీజ్ అయిపోయింది. దాన్ని బాగుచేయాలంటే రూ.60 వేలు వరకు అవుతుందని మెకానిక్ చెప్పాడు. బండికి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్లు చూసి ఇంజిన్ సీజ్ అయితే ఇన్సూరెన్స్ ఇవ్వలేమని చెప్పారు. గట్టిగా అడిగితే రూ.4 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధంలేదు. ఆటోనే నా జీవనాధారం. పైగా.. ఇంట్లో అన్ని వస్తువులు వరదలో మునిగి పాడైపోయాయి. ఏం చేయాలో, ఎలా బతకాలో తెలీడంలేదు’.. ఇదీ విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలోని శాంతినగర్‌లో ఉంటున్న వేల్పుల మురళి ఆవేదన.
.. ఇలా బుడమేరు వరదలో మునిగి విజయవాడలో దాదాపు రెండు లక్షల వాహనాలు పాడైపోయినట్లు అంచనా. అందులో సుమారు లక్షన్నర ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఆటోలు 15 వేలు, కార్లు 20 వేల వరకూ ఉండొచ్చని అంచనా. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ముంపు వాహనాలే కనిపిస్తున్నాయి. వరద నీటిలో మునగడంతో చాలా వాహనాల ఇంజన్లు సీజ్ అయిపోయాయి. కానీ, ఇన్సూరెన్స్ ఉన్న ఇలాంటి వాహనాలకు ఇబ్బందుల్లేకుండా క్లెయిమ్‌లు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీమా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్‌ల పరిష్కారంలో ఉదారంగా ఉండాలని చెప్పామని, వాళ్లు ఒప్పుకున్నారనీ చెప్పారు. ఈయన మాటలు నమ్మి పూర్తి ఇన్సూరెన్స్ వస్తుందన్న ధీమాతో బాధితులు దెబ్బతిన్న తమ వాహనాలను కంపెనీలకు తీసుకెళ్తున్నారు. అక్కడ కంపెనీల ప్రతినిధులు వీటికి అసలు బీమా ఎలా వస్తుందని బాధితుల్ని ఎదురు ప్రశి్నస్తున్నారు.
బీమా నిబంధనలతో ఆందోళన..
వాహనాలు వరద నీటిలో ఉన్నప్పుడే తాము చూడాలని, కడిగి తీసుకొస్తే బీమా క్లెయిమ్ చేయడం కుదరదని చెబుతుండడంతో వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. వాహనాలను చూసేందుకు సైతం కంపెనీల ప్రతినిధులు రావడంలేదు. 10–15 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అప్పటివరకు ఆగలేమని చెబుతుండడంతో ఎంతోకొంత క్లెయిమ్ ఇస్తామని చెప్పి రూ.2 నుంచి రూ.5 వేల వరకూ నిర్థారించి పంపేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మీ వాహనం మునిగిందని గ్యారంటీ ఏమిటని చాలామందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరదలో బండి మునిగిన ఫొటోను అడుగుతుండడంతో బాధితులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే నరసింహారావు ఇంజన్, ఎలక్ట్రిక్ వైరింగ్, గేర్‌బాక్స్ ఇతర పరికరాలు పనికిరాకుండా పోవడంతో రిపేర్‌కు రూ.30 వేలు అవుతుందని షోరూమ్‌లో కొటేషన్ ఇచ్చారు. కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం వాహనాన్ని కడిగేసి తీసుకొచ్చారు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేసింది. అతను ప్రాథేయపడితే రూ.3 వేలు ఇవ్వడానికి ఒప్పుకుంది. మరోవైపు.. ఇలాంటి ద్విచక్ర వాహనాల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇన్సూరెన్స్ లేదని చెబుతున్నారు. వారంతా సొంత డబ్బుతోనే వాహనాలను బాగుచేయించుకుంటున్నారు.
ఆటోవాలాల పరిస్థితి దయనీయం..
ఇక పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు తీసుకెళ్లే ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంటనే ఆటో మరమ్మతు చేయించుకోకపోతే ఉన్న వ్యాపారం పోయి రోడ్డు మీద పడతామని గగ్గోలు పెడుతున్నారు. కంపెనీల వాళ్లు కనీసం 10 రోజుల సమయం అడుగుతుండడం, వేచి ఉన్నా నామమాత్రంగా ఎంతోకొంత ఇచ్చే పరిస్థితి ఉండడంతో దానిపై ఆశలు వదిలేసుకుని అప్పుచేసి ఆటోలను బాగు చేయించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment