International Day of the Girl Child: భళారే.. బాలిక | Special Story: International Day of the Girl Child 2022 | Sakshi
Sakshi News home page

International Day of the Girl Child: భళారే.. బాలిక

Published Tue, Oct 11 2022 10:11 AM | Last Updated on Tue, Oct 11 2022 10:17 AM

Special Story: International Day of the Girl Child 2022 - Sakshi

ఆడపిల్ల..భూమ్మీద పడగానే.. పెదవి విరుపు..ఎదుగుతున్న ప్రతి దశలోనూ ఆటంకాలు..స్కూలు దూరంగా ఉంటే చదువు ఆపేయమంటారు. హైస్కూలు పూర్తవగానే ఈ చదువు చాలనేవారు కొందరు. డిగ్రీ చదువుదామంటే చదివి ఉద్యోగాలు చేయాలా అంటూ దీర్ఘాలు..పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుందంటూ తన ఎదుటే చర్చలు..ఒంటరిగా వెళ్లాలంటే ఇబ్బందులు..ధైర్యంగా ముందడుగు వేద్దామంటే వెనక్కులాగేవారెందరో..మరోపక్క వేధింపులు..ఇలా పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛను హరించేవారే ఎక్కువ.

ఇలాంటి నిరాశాపూరిత వాతావరణం అమ్మాయిల్లో చాలామందికి ఎదురవుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తల్లితండ్రులు తమ ఆడబిడ్డలనూ చదివిస్తున్నారు. ఉద్యోగానికి పంపుతున్నారు. మరోపక్క ప్రభుత్వమూ అవకాశాల్లో ఆడపిల్లకు అగ్రాసనమేస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో వీరికి పూర్తి ప్రోత్సాహం లభిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...

ప్రతిభకు పట్టుదల జత కలిసి.. 
కడియం: ఆస్తిపాస్తుల్లేవు.. ఇద్దరూ ఆడపిల్లలు.. తండ్రి చిరు సంపాదనే ఆధారం..ఇలాంటి నేపథ్యంలో ప్రతిభకు పట్టుదల తోడై అ అమ్మాయి విదేశీ విద్యను అభ్యసిస్తోంది. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన మేణ్ణి లీలావిష్ణుజ్యోతి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. పదిలో 9.7 గ్రేడు సాధించి, ట్రిపుల్‌ ఐటీకి ఎంపికై, బీటెక్‌ పూర్తి చేసింది. 2019లో ఆమెరికాకు చెందిన నాసా సంస్థ నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సమ్మిట్‌కు ఎంపికైంది.

ఈ సమ్మిట్‌కు  30వేల ప్రాజెక్టుల్లో 100 మాత్రమే ఎంపిక చేస్తారు. తన సోదరి తులసీశ్యామలతో  విష్ణుజ్యోతి కలిసి రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైంది. దీంతో ఆ సమ్మిట్‌లో పాల్గొనగలిగింది. ఇంటర్నేషనల్‌ ఇండో నార్డియాక్‌ సమ్మిట్‌ (ఐనాక్‌)లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించింది. గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ)లో 340కి 305 మార్కులు సాధించింది. ఇంటర్నేషనల్‌ ఇంగ్లి్లషు లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌)లో 9కి 6.5 పాయింట్లు సాధించింది. అమెరికాలోని న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ చేసే అవకాశం లభించింది. ఈమె ప్రతిభకు ముగ్దులైన దాతల తోడ్పాటుతో ప్రస్తుతం న్యూజెర్సీలో ఎంఎస్‌ చేస్తోంది. ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తోంది. 

ఒంటరిగానే జాతీయ స్థాయికి...
సాక్షి, అమలాపురం: పదేళ్ల క్రితం దురదృష్టవశాత్తూ నా న్న దూరమయ్యాడు. ఐదారేళ్ల క్రితం ఒక ప్రమాదంలో కాలికి బలమైన గాయమైంది. అయినా ఆ యువతి ఆ త్మవిశ్వాసం ముందు ఎదురైన సవాళ్లే చిన్నబోయాయి. ముమ్మిడివరానికి చెందిన యెండూరి లలితాదేవి తా ను మాత్రం చిన్నప్పుడు కలలుగన్నట్టు జాతీయ స్థా యి వాలీబాల్‌ క్రీడాకారిణిగా ఎంపికవుతోంది. ప్రసుత్తం రాజమ హేంద్రవరంలో ఉపాధి కోసం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్న లలితా బీచ్‌ వాలీబాల్‌లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

8వ తరగతి నుంచి తాను చదువుకున్న ముమ్మిడివరం ఉన్నత పాఠశాల లో వాలీబాల్‌ క్రీడ ఆరంభించిన లలితా దేవి తరువాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగింది. తల్లి ప్రోత్సాహం.. కోచ్‌ల పర్యవేక్షణలో వాలీబాల్‌లో రాటుదేలింది. ఇప్పటి వరకు బీచ్‌ వాలీబాల్‌లో రెండుసార్లు జాతీయ పోటీలకు, వాల్‌బాల్‌లో తొమ్మిదిసార్లు జాతీయ పోటీలకు, రెండుసార్లు జాతీయ గేమ్స్‌కు ఎంపికైంది. ఆమె సాధిస్తున్న విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ‘వాలీబాల్‌ ఆడిన తొలి రోజుల్లో కష్టంగా అనిపించేది. ఒకసారి ఆ ఆటను ప్రేమించడం మొదలు పెట్టాక వెనుతిరిగి చూడలేదు. కాలికి గాయం అయినప్పుడు గేమ్‌కు దూరమవుతానని భయపడినా పట్టుదలతో సాధన చేసి గాయాన్ని అధిగమించాన’ని లలితాదేవి చెబుతోంది.

కైవల్య ప్రతిభకు ఆకాశమే హద్దు 
నిడదవోలు : వ్యొమగామి కావడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోందీ బాలిక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మీ దంపతుల మొదటి సంతానం కైవల్య. ఇస్రో వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ఇటీవల తణుకులో నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, సైన్స్‌ ఫెయిర్‌లలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇస్రో, నాసాకు అనుబంధ సంస్థ స్పేస్‌ స్పోర్ట్స్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఢిల్లీ)  నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది.

వచ్చే మే నెలలో జరగనున్న నాసా ఒలింపియాడ్‌ పరీక్షకు అర్హత సాధించింది. ఇటీవల విశాఖలో సముద్ర శాస్త్రవేత్తల సమావేశంలో సముద్రాల పరిరక్షణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఇచ్చింది. స్పేస్‌పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ (న్యూఢిల్లీ) అంబాసిడర్‌ బృంద సభ్యులుగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది. ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనమికల్‌ సెర్ప్‌ కొలబ్రేషన్‌ సహకారంతో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఆస్టరాయిడ్‌ను గుర్తించింది. 

ఇష్టమైన రంగంలో కష్టపడాలి
తుని: ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ నైపుణ్యంతో దూసుకుపోతున్నారు. విద్య,ఉద్యోగ, క్రీడా రంగాల్లో తమదైన ముద్ర కనబరుస్తున్నారని చెస్‌ క్రీడాకారిణి బి.ప్రత్యూష అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె అనుభవాలను ఇలా వివరించారు... చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న చదరంగం మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ స్థాయికి తీసుకువెళ్లింది. జాతీయ,అంతర్జాతీయ వేదికలపై ఎంతోమంది ప్రముఖ చెస్‌ క్రీడాకారులతో పోటీపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించాను.

ప్రతిభ ఉంటే ఏదైనా సాధించడం సాధ్యమని నా అనుభవం నేర్పింది. పాఠశాల విద్య నుంచి కళాశాల వరకు నా ప్రయాణం సాగింది. తల్లిదండ్రులు, గురువులు అందించిన çస్ఫూర్తి అంతర్జాతీయ మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రతి బాలికా తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. తుని మండలం ఎస్‌.అన్నవరానికి చెందిన నేను ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ప్రస్తుతం అకాడమి ద్వారా ఎంతోమంది క్రీడాకారులకు  చదరంగంలో శిక్షణ ఇస్తున్నాను’ అని వివరించారు.

చిట్టితల్లి చదువుకు జగనన్న సాయం
కపిలేశ్వరపురం/రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ బాలికా విద్యలో నాణ్యతను పెంచేందుకు దోహదపడుతోంది. విద్యార్థుల డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ, ఆహార నాణ్యత, మరుగుదొడ్లలో పరిశుభ్రత, తదితర అంశాలను సచివాలయ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షిస్తున్నారు. 

గ్రామ మహిళా పోలీస్‌ గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ పేరుతో సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈవ్‌ టీజింగ్, పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టాలపై ప్రాధాన్యతను వివరిస్తున్నారు. 

డ్రాప్‌ అవుట్ల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపుతున్న చిన్నారి తల్లి ఖాతాకు రూ.15వేలు సాయమందిస్తుంది.  గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థుల్లో బాలికలే అధికం.  

ఆడపిల్లలను ఆదిలోనే అంతం చేసే లింగ నిర్ధారణ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.  
కాకినాడలో 0–6 నెలల శిశువుల సంరక్షణ కోసం శిశుగృహ, రాజమహేంద్రవరంలో 6–12  సంవత్సరాల బాలల సంరక్షణ కోసం బాలసదన్‌ నిర్వహిస్తోంది. 

చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పర్యవేక్షణలోని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని 84 హాస్టళ్లు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి.  
ఆడపిల్లలను ఆపదలో ఆదుకునే దిశ యాప్‌పై పోలీసు అనుబంధ శాఖల సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు.  గడచిన ఆరునెలల్లో కాకినాడలో 4,75,005, తూర్పుగోదావరి జిల్లాలో 2,38,944, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 1,34,671 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

బహిర్గతం చేసుకోలేని సమస్యలను తెలిపేందుకు పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం బాక్సులు ఏర్పాటు చేసింది.

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098
బాల్య వివాహాల కట్డడి బాలికా వికాసానికి దోహదపడుతోంది. ఇలాంటి సంఘటనపై సమాచారం అందించాలని ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098 ఏర్పాటు చేసింది.

సంవత్సరం    అడ్డుకున్న బాల్య వివాహాలు
2018–19            185
2019–20            162
2020–21            147
2021–22            63 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement