తోకలేని పిట్ట తొంభై ఊళ్లు దాటి వెళ్లిపోయినట్టుంది. అభిమానం నిండిన అక్షరాలతో ఆత్మీయంగా పలకరించే ఉత్తరం కాలగర్భంలో కలిసిపోయింది. మారుతున్న కాలం ఒకనాటి జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తోంది. ఆ జాబితాలోకి ఉత్తరం కూడా చేరిపోయింది. ఇప్పుడు అంతా హాయ్, బాయ్ సంస్కృతే కనిపిస్తోంది. నాడు ఉత్తరాలు పంపుకున్న కాలంలో కనిపించిన ఆత్మీయత, అనుబంధం రెండూ ఇప్పుడు లేవు.
ఒకప్పుడు ఉత్తరమే ఉత్తమ సమాచార సాధనం. ఆ రోజుల్లో ఉత్తరం వచ్చిందంటే ఆ ఇంట్లో ఎంతో ఆనందం. మా అబ్బాయి ఉత్తరం రాశాడనో, మా అమ్మాయి ఉత్తరం రాసిందనో, బంధువుల నుంచి ఉత్తరం వచ్చిందనో ఇరుగుపొరుగు వారితో సంతోషంగా చెప్పుకునేవారు. చదువు రాని వారయితే ఎవరినో పిలిపించుకుని ‘గౌరవనీయులైన నాన్నకు’, ‘ప్రియమైన అమ్మకు’ అన్న పదాలను ఒకటికి రెండు సార్లు ఇష్టంగా చదివించుకునేవారు. ఉత్తరం సాంతం సావధానంగా విని కళ్లు తుడుచుకునే వారు. ఆ లేఖను జాగ్రత్తగా పొదివిపెట్టుకునేవారు. ఉత్తరంలో ఉండే సంబోధన, రాసే తీరు ఆత్మీయతను, అనురాగాన్ని పంచేవి.
అందరి బంధువు..
ఉత్తరాలే కాదు అవి మోసుకువచ్చే పోస్టుమ్యాన్లు కూడా ఒకప్పుడు అందరి బంధువులే. అందరి మంచి చెడ్డల్లో ఆయనకూ భాగం ఉండేది. పోస్ట్‌మ్యాన్ వచ్చే సమయానికి ఇంటి బయట నిలబడి ‘మాకేమైనా ఉత్తరం వచ్చిందా’ అని ఆత్రంగా అడిగే రోజులు ఎంతో బాగుండేవి. ఉత్తరం వచ్చిందంటే ఆనందపడేవారు. రాలేదంటే ఎందుకు రాలేదో అని ఆరా తీసి నిరాశ చెందేవారు. ఆలస్యంగా ఉత్తరం రాసినందుకు వేసే నిష్టూరాలు, నిందలు కూడా ఆత్మీయతను పెంచేవే. ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమించమనే వేడుకోలు చాలా లేఖలను ప్రత్యేకంగా ఉంచేవి. పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాల కోసం ఆరా తీయడం, ఉత్తరం రాశాక పోస్టు డబ్బాలో వేయడానికి సరదా పడడం, చిన్న పిల్లలతో ఉత్తరాలు చదివించుకోవడం.. వంటి ఆనందాలు ముందు తరాల వారు ఆసాంతం ఆస్వాదించారు. ఉత్తరంలో ఉన్న అక్షరాల్లో తమ వారు కనిపిస్తుంటే పరవశించిపోయేవారు.
ఏదీ ఆ అనుబంధం..
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతోఇపుడంతా సెల్ మయమైపోయింది. ఇంటిలో అందరికీ సెల్‌ఫోన్లు ఉండడంతో షార్ట్ మెసేజీ సర్వీస్ అలవా టైంది. సందేశాలతో పాటు అనుబంధాలు కూడా తగ్గిపోయాయి. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు వచ్చాక సమాచారం పంపించడం సులభమైంది. కానీ సొంత దస్తూరితో అమ్మకు రాసిన ఉత్తరం ముందు ఏ సాధనమైనా బలాదూరే. దూరంగా ఉన్న భర్త కోసం భార్య పంపించిన ప్రేమలేఖతో పోల్చితే ఈనాటి టెక్ట్స్ మేసేజీలు ఎందుకూ పనికిరావు. పక్కింటి పిల్లాడితో కొడుకు రాసుకున్న ఉత్తరం చదివించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే నేటి డిజిటల్ యుగం ఎందుకో అంత ఆనందకరం అనిపించదు. ఉత్తరం రాయడం అందరికీ తె లిసిన ఓ కళ. అందరూ అందులో నిష్ణాతులే. కానీ నేడు ఆ కళ కలగా మారిపోయింది.
పిల్లలకు ఉత్తరం అంటే ఏంటో తెలీదు
ప్రస్తుత తరం చిన్నారులకు ఉత్తరం అంటే ఏమి టో తెలియదు. ఇప్పుడు ఉత్తరాల సంఖ్య బాగా తగ్గిపోయింది. పోస్ట్‌బాక్స్‌లలో సైతం ఉత్తరాలు రావడం తగ్గాయి. ఇపుడు ప్రపంచమంతా సెల్‌ఫోన్ మయమైపోయింది.
– ఎ.కాంతారావు, పోస్టల్ సూపరింటెండెంట్
ఉత్తరమే ఉత్తమ సాధనం
గతంలో ఉత్తరమే సమాచార సాధనం. బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకునేందుకు ఉత్తరం ఎంతగానో తోడ్పడేది. ఉత్తరం వచ్చిందంటే చాలు. ఆ ఆనందమే వేరు. ఇపుడు సెల్‌ఫోన్ వచ్చి ఆ ఆనుబంధాన్ని, ఆత్మీయతను వేరు చేసింది. ఇపుడు చూద్దామన్నా ఉత్తరం కనిపించడం లేదు.
– డీపీ దేవ్, విశ్రాంత తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment