ఒకప్పుడు టీ తాగడమనేది చాలా చిన్న విషయం. ఏ చిన్న కొట్టు దగ్గరికో వెళ్లి.. అర్జెంటుగా టీ తాగి వెంటనే కప్పు అక్కడ పెట్టి వచ్చిన దారిన వెళ్లిపోయేవారు. అయితే, కాలం మారింది. పద్ధతులూ మారాయి. అన్నింటా ఎం‘జాయ్’ కోరుకుంటున్న జనం టీ సేవనమూ అదే రీతిలో ఉండాలని భావిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా టీ కొట్లూ మారిపోయాయి. ఆధునిక హంగులు సంతరించుకున్నాయి.
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో ఒకప్పుడు టీ తాగాలంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతకాల్సిన పరిస్థితి. కానీ, నేడు అలా కాదు. ప్రతి ఏరియాలోనూ టీ కేఫ్‌లు ఏర్పాటయ్యాయి. అదీ విశాల ప్రాంగణాల్లో. శివారు ప్రాంతాల్లో అయితే ఆధునిక హంగులతో పెద్దపెద్ద కేఫ్‌లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. తీరిగ్గా కూర్చొని..అలా కబుర్లు చెప్పుకుంటూ టీ/కాఫీ తాగేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి వద్ద రద్దీ ఎక్కువగా కని్పస్తోంది.
ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు సైతం ఖాళీ సమయం దొరికితే చాలు కేఫ్‌ల బాట పడుతున్నారు. కొన్ని కేఫ్‌ల వద్ద కార్లు, బైకుల రద్దీని చూస్తే ఏమి‘టీ’ మార్పు అని ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం వరల్డ్‌కప్ క్రికెట్ సీజన్ నడుస్తుండడంతో కేఫ్‌లు మరింత రద్దీగా మారాయి. ఒక్క అనంతపురం నగరంలోనే కాకుండా..ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం, కదిరి తదితర పట్టణ ప్రాంతాలు, చివరకు మండల కేంద్రాల్లో సైతం టీ కేఫ్‌ల సంస్కృతి విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీస్టాళ్లు, కేఫ్‌లు కలిపి ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా.
అభిరుచికి అనుగుణంగా..
ఒకప్పుడు టీ, కాఫీ అంటే ఆయా పొడులతో చేసేవే ఉండేవి. కానీ, నేడు వాటిలోనూ వివిధ రకాలు లభిస్తున్నాయి. సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, ఇరానీ ఛాయ్, పెప్పర్‌మెంట్ టీ, మసాలా టీ, లెమన్ టీ, లావెండర్ టీ.. ఇలా పలు రకాలు విభిన్న రుచుల్లో లభ్యమవుతున్నాయి. టీ మాత్రమే కాకుండా వివిధ రకాల కాఫీలు, రాగిమాల్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటున్నాయి. జనాన్ని ఆకర్షించేందుకు ఆయా దుకాణదారులు కొత్తదారులు అన్వేíÙస్తున్నారు. ఫ్రీ వైఫై అంటూ యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకట్టుకునేలా కుర్చీలు ఉంచుతున్నారు. టీ/కాఫీ అందించే కప్పులూ విభిన్నంగా ఉంటున్నాయి.
బ్రాండ్‌లూ వచ్చేశాయి!
టీ కేఫ్‌లకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు వాటినీ ‘బ్రాండ్’లుగా మార్చేస్తున్నారు. ‘ప్రాంచైజీలు’ ఇస్తూ చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. వారు నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఔట్‌లెట్ డిజైన్ చేయించడంతో పాటు వివిధ రకాల టీలు, కాఫీలు తయారుచేయడానికి వీలుగా మెటీరియల్ సరఫరా చేస్తున్నారు. వాటి తయారీలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ కేఫ్‌లు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.
‘ఉపాధి’ మార్గం
చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా టీ కేఫ్‌లను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి వ్యయం, మంచి మాస్టర్లు దొరికితే నిర్వహణ సులువు కావడం, ఆదాయం కూడా తగినంతగా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ యువత ఎక్కువగా ఉంటున్నారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం కోసం టీ కేఫ్‌లు నిర్వహించే వారూ ఉన్నారు.
‘చర్చా’వేదికలు
కేఫ్‌లు కేవలం పిచ్చాపాటి కబుర్లతో టీ, కాఫీ సేవనానికే పరిమితం కాలేదు. ‘చర్చా’వేదికలుగానూ మారాయి. ఇక్కడ రాజకీయ చర్చలు వేడీవేడిగా సాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడుస్తుంటాయి. ఉద్యోగ సంబంధ కార్యకలాపాలూ జరుగుతుంటాయి. పెళ్లి సంబంధాలూ కుదిరిపోతుంటాయి. ఇలా ఒకటేమిటి అనేక వ్యవహారాలకు టీ కేఫ్‌లు అడ్డాగా మారాయి.
టీ కేఫే జీవనాధారం
ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ టీ కేఫ్‌లో వర్కరుగా పనిచేసేవాణ్ని. అదే కేఫ్‌నకు ఓనర్‌గా ఎదిగా. ఇది నా కుటుంబానికి జీవనాధారంగా మారింది. పలు రకాల టీ తయారు చేస్తున్నా. ఆశించిన స్థాయిలో వ్యాపారం అవుతోంది. ఉపాధికి ఢోకా లేదు. నాన్న కూడా నాకు సహాయంగా ఉంటున్నారు.
– ధనుంజయ, టీ కేఫ్ నిర్వాహకుడు, రాయదుర్గం
స్నేహం బలపడే వేదిక
టీ కేఫ్‌లు స్నేహం బలపడే వేదికలనడంలో అతిశయోక్తి లేదు. కాలేజీకి బంక్ కొట్టినా.. లేదా తోటి స్నేహితులందరం కలుసుకునేందుకు అడ్డాగా టీ కేఫ్‌లే ఉంటున్నాయన్నది వాస్తవం. ఇక్కడే కొత్త స్నేహాలు కూడా చిగురిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీరిక సమయాల్లో కేఫ్‌లలో కాలక్షేపం చేస్తూ ప్రపంచం గురించి చర్చించుకుంటుంటారు.
– కార్తీక్, డిగ్రీ విద్యారి్థ, తాడిపత్రి
ఆదరణ పెరుగుతోంది
ప్రతి విషయాన్ని చర్చించుకోవడంతో పాటు ప్రపంచంలోని విషయాలన్నింటిపై మాట్లాడుకునేందుకు గతంలో రచ్చబండలు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరి నుంచి పదుల సంఖ్యలో కూడుకుని మాట్లాడేందుకు వేదికగా టీ కేఫ్‌లు మారాయి. ఫలితంగా వీటికి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాపారంపై చాలా మంది యువత సైతం ఆసక్తి చూపుతున్నారు.
– రవి, టీ మాస్టర్, తాడిపత్రి
మిత్రులతో మాట్లాడే అవకాశం
టీ తాగడానికి బాగా అలవాటు పడ్డాం. గతంతో పోలి్చతే ఇప్పుడు నగరంలో చాలా టీ స్టాల్స్, కేఫ్‌లు వెలిశాయి. మిత్రులతో కలసి ఛాయ్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు కేఫ్‌లు వేదికగా మారాయి.
– సూర్యనారాయణ, రెవెన్యూ కాలనీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment