పై మొదటి ఫొటో చూశారా..! అచ్చం నయాగరా జలపాతాన్ని తలపించేలా ఉంది కదా. దట్టమైన అడవి మధ్య.. కనువిందు చేసే ప్రకృతి సోయగాల వడిలో పర్యాటకుల్ని రా.. రమ్మని పిలుస్తోన్న ఈ ప్రదేశం ఎక్కడో తెలుసా..! మందస మండలంలోని బుడారిసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా– ఒడిశా మధ్య కళింగదళ్ రిజర్వాయర్ ఎగువ భాగంలో కొండలపై నుంచి దూకుతున్న జలపాతమిది. దీన్ని బత్తర్‌సాయి జలపాతంగా పిలుస్తున్నారు.
రెండో చిత్రం చూశారా? వనగిరుల నుంచి స్వచ్ఛమైన జలధార ఎలా కిందికి జారుతుందో..! పచ్చందాల మధ్య చెంగున దూకుతూ కనువిందు చేస్తున్న ఈ జల పాతం మందస మండలం చీపి పంచాయ తీలోని దాలసరి అనే చిన్న గిరిజన కుగ్రామం సమీపంలోనిది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరోనా లాక్‌డౌన్ కాలంలో బయట ప్రపంచానికి పరిచయమైన సుందరమైన జలపాతాలివి. ఈ రెండే కాదు భామిని మండలం నులకజోడు గ్రామ సమీపంలో గల తువ్వకొండలో మరో జలపాతం వెలుగు చూసింది. పిల్లలు సరదాగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే సరికి ఈ జలపాతాలు దర్శనమిచ్చాయి. దీంతో ఇప్పుడందరి దృష్టి జలపాతాలపై పడింది. పేదల ఊటీగా సిక్కోలు జిల్లాను చెబుతారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ చల్లగా ఉంటుందని అంటారు. ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులు, ఇంకోవైపు అటవీప్రాంతం, మహేంద్ర గిరులు ఇలా ఒకటేంటి చల్లదనాన్ని ఇచ్చే ఎన్నో వనరులు సిక్కోలు సొంతం. ఇప్పుడు ఆ జాబితాలోకి జలపాతాలు వచ్చి చేరాయి. ఇప్పటికే సీతంపేట గిరిజన మండలంలో ఎనిమిది జలపాతాలు, భామిని మండలంలో ఒక జలపాతం ఉన్నాయి. తాజాగా మందసలో రెండు, భామినిలో ఒకటి బయటపడ్డాయి. పర్యాటక శాఖ, అటవీశాఖ సంయుక్త సర్వే చేపడితే జిల్లాలో ఉన్న జలపాతాల లెక్క తేలే అవకాశం ఉంది.
జలపాతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..
జిల్లాలో ఇప్పటికే ఉన్న ఎనిమిది జలపాతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సుమారు రూ. 4 కోట్లతో పనులు చేపట్టాలని పర్యాటక నిర్ణయించింది. అందులో సీతంపేట మండలంలో మెట్టుగూడ, దోనుబాయి జలపాతాలను రూ. 60లక్షలతో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు మాస్టర్ ప్లాన్ ద్వారా మరికొన్ని పనులు చేపడుతున్నారు. మెట్టగూడ జలపాతాన్ని రూ. 50 లక్షలతో, సున్నపుగెడ్డ జలపాతాన్ని రూ. 45లక్షల తో, కుసిమి జలపాతాన్ని రూ. 27లక్షలు, తొత్తడి జలపాతాన్ని రూ. 21లక్షలు, మెకువ జలపాతాన్ని రూ. 46లక్షలు, బెనరాయి జలపాతాన్ని రూ.30లక్షలు, సవరగోడి జలపాతాన్ని రూ.75లక్షలు, పండరాయి జలపాతాన్ని రూ. 41లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే భామిని మండలం నల్లరాయి గూడ జలపాతం వద్ద కూడా అప్రోచ్ రోడ్డు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
‘కొత్త’ జలపాతాలపై మంత్రి సీదిరి దృష్టి...
కొత్తగా బాహ్య ప్రపంచానికి తెలిసిన మందస మండలంలో దాలసరి, బత్తర్‌సాయి జలపాతాలపై రాష్ట్ర పశు, మత్స్య శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టిసారించారు. తన సొంత నియోజకవర్గంలో వెలుగు చూసిన జలపాతాలు గురించి తెలుసుకుని, వాటి అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే దాలసరి జలపాతం వద్దకు లోయల మీదుగా వెళ్లి తిలకించారు. ఎలాగైనా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అభివృద్ధి చేస్తాం...
జిల్లాలోని జలపాతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. కొత్తగా వెలుగు చూసిన జలపాతాలపై మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టి సారించారు. త్వరలో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తాం. పర్యాటకులు సురక్షితంగా జలపాతాలను వీక్షించేలా సౌకర్యాలు కల్పిస్తాం
–నారాయణరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment