కోటగ్రామ సమీపంలోని ఉరిబండ
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అబ్బుర పరిచే బురుజులు.. శత్రుదుర్భేద్యమైన కట్టడాలు.. మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు.. సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు.. ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచులు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు.. ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవరాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలపై ఈ ఆదివారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
చదవండి: సాగర గర్భంలో పర్యాటకం
చంద్రగిరి రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే చంద్రగిరి దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచుకున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరుకునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచెంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారు.
గుర్రాల విశ్రాంతి కోసం నిర్మించిన చావిడి
నిరంతరం నిఘా
దుర్గం కొండపైకి చేరుకోగానే మనకు కనిపించేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం. అన్ని వేళల్లో ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిరక్షించేవారు. వర్షాకాలంలోనూ విడిది చేసేందుకు మండపం కింద భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అబ్బురపరిచే కోనేరు
వందల అడుగుల ఎత్తుతో ఉన్న దుర్గం కొండపైకి చేరుకోగానే.. అబ్బురపరిచే కోనేరు దర్శనమిస్తుంది. ఇది కేవలం వర్షపు నీటి ఆధారంగా ఉంటుంది. ఏడు నులక మంచాల దారాలంత లోతు ఉంటుందని చెబుతారు. అయితే ఇంత వరకు కోనేటి లోతును ఎవరూ అంచనా వేయలేదు.
సైనికుల బసకు ప్రత్యేక మండపాలు
రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు షిఫ్ట్‌ల పద్ధతిలో విధులు నిర్వహించే వారు. వీరి విడిది కోసం రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. కొండపై మట్టి, రాళ్లు లభించకపోయినప్పటికీ ఇంత పెద్ద మండపాలను ఎలా నిర్మించారో అన్న సందేహం కలగకమానదు. అదేవిధంగా గుర్రాల కోసం మండపాలను సైతం దుర్గం కొండపై నిర్మించడం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
బురుజు దాటిన తర్వాత మొదటగా కనిపించే మండపం
నాటి ఉరికొయ్యే–నేటి ఉరిబండ
చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు. అయితే కొంత మంది వాటిని గంటా మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని మరో వాదన వినిపిస్తోంది.
పూర్తిగా నిషేధం
దుర్గం కొండపైకి వెళ్లేందుకు కేంద్ర పురావస్తుశాఖ నిషేధం విధించింది. పూరి్వకుల ఆస్తులను పరిరక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారిని కాదని అక్కడకు వెళ్లేందుకు యత్నిస్తే జైలు తప్పదు సుమీ.
విశాలమైన కోనేరు
ఉప్పు సట్టి–పప్పు సట్టి
దుర్గం కొండకు పడమటి భాగంలో ఉప్పుసట్టి–పప్పుసట్టి ఉంది. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తుంటారు. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి.
దుర్గం కొండపై రాతికంచాలు
రాతి కంచాల్లోనే భోజనాలు
దుర్గం కొండపై కాపాలాగా ఉండే సైనికులు రాతి కంచాల్లోనే భోజనాలు చేసేవారిని తెలుస్తోంది. కోనేటి నుంచి పది అడుగుల దూరంలోని బండపై అడుగున్నర వెడల్పుతో అంగుళం లోతుతో గుండ్రటి కంచాలు కనిపిస్తాయి. వీటికి రెండువైపులా కూరలను ఉంచుకునేందుకు చెక్కిన తీరు ఆశ్చర్యమేస్తోంది. భటులందరూ వీటిపైనే భోజనాలు చేసుకుని, కోనేటిలోని నీటిని తాగేవారు.
దుర్గం కొండకు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ప్రహరీగోడ
అక్కగార్లు, నాగాలమ్మకు పూజలు
కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
భటుల విశ్రాంతి కోసం కొండపై నిర్మించిన ప్రత్యేక మండపాలు
Comments
Please login to add a commentAdd a comment