దబ్బాపుట్టు గ్రామంలో రామాలయాన్ని ప్రారంభించి పూజలు చేస్తున్న స్వరూపనందేంద్ర సరస్వతి
సాక్షి, పాడేరు (ఏఎస్సార్ జిల్లా): వివిధ ప్రాంతాల్లోని గిరిజనులతో విశాఖలోని శ్రీశారదా పీఠానికి పాతికేళ్ల అనుబంధం ఉందని, గిరిజనులంటే తమ పీఠానికి ప్రాణమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. పాడేరు ఏజెన్సీలో టీటీడీ సహకారంతో నిర్మించిన రామాలయాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం, అరకు లోయ, పాడేరు ప్రాంతాల్లోని గిరిజనులకు తమ పీఠం ద్వారా సేవ చేస్తున్నామన్నారు.
గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ, చలికాలంలో రగ్గులు, దుప్పట్లు, వంద గోవులను కూడా పంపిణీ చేశామన్నారు. ఆంజనేయ స్వామి గిరిజనుడేనని, ఆంజనేయుడి సహకారంతోనే శ్రీరాముడు లంకకు చేరి రావణాసురుడిని అంతమొందించారని, ఆ పోరాటంలోనూ గిరిజనులే ఉన్నారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల బాధ్యతను స్థానిక గిరిజనులకే శిక్షణ ఇచ్చేందుకు శారదా పీఠం సిద్ధంగా ఉందన్నారు.
గిరిజనులకు సింహాచలం అప్పన్న దర్శనం చేయించడంతోపాటు చందనమాల వేయించి, భక్తిశ్రద్ధలతో దీక్ష పూర్తి చేయించి, రవాణా ఖర్చులు భరిస్తూ వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అనేక ప్రాంతాల గిరిజనులతో పాటు పీవీటీజీ తెగను కూడా తిరుమల యాత్రకు తీసుకెళ్లామన్నారు.
తొలుత పాడేరు మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దబ్బాపుట్టు గ్రామంలో రామాలయాన్ని ప్రారంభించారు. గిరిజనులంతా స్వామీజీకి పూలమాలలు వేసి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సింగరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment