![State Capital Decision Belong To Andhra Pradesh Govt Says High Court - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/5/hf.jpg.webp?itok=jpx3jssy)
సాక్షి, అమరావతి: రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాంతంలో వద్దని చట్టబద్ధ కమిటీనే చెప్పింది..
విచారణ సందర్భంగా సీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అత్యంత సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. అంతేకాకుండా అది వరద, భూకంప ప్రభావిత ప్రాంతమని కూడా కమిటీ నివేదికలో ప్రస్తావించిందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసిందన్నారు. అందులో భాగంగానే అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. గత ప్రభుత్వం ఈ–బ్రిక్స్, గ్రాఫిక్స్ చూపించి రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని, వాటిపై ఎలాంటి విచారణ అవసరం లేదని తెలిపారు.
హోదా హామీని కూడా నెరవేర్చాలి
శాసన మండలి తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాజధానిగా అమరావతి ఉండటంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు. ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సీఆర్‌డీఏ ఏర్పాటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలే అవుతాయన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు.
ఆ నివేదికలను కొట్టివేయండి...
ప్రభుత్వం తరఫున బుధవారం నాడు అడ్వొకేట్ జనరల్, సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, శాసనమండలి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్ ప్రసాద్ వినిపించిన వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు తిరుగు సమాధానం ఇచ్చారు. రైతుల వాదనలు వినకుండానే హైవర్ కమిటీ, బోస్టన్, జీఆర్‌ఎన్ రావు కమిటీలు నివేదికలు ఇచ్చాయని, అవేమీ చట్టబద్ధ నివేదికలు కాదని, అందువల్ల వాటిని కొట్టి వేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనలకు లోబడే అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు.ల్యాండ్ పూలింగ్ పథకం కింద కల్పించాల్సిన ప్రయోజనాలన్నింటినీ రైతులకు అందించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిధుల కొరతను కారణంగా చూపి అభివృద్ధిని ఆపడానికి వీల్లేదన్నారు. ఇప్పటి వరకు శాశ్వత హైకోర్టును నిర్మించలేదని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయటమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment