బలిజిపేట: పగటి ఉష్ణోగ్రతలతో పాటు విద్యార్థులకు పరీక్షల వేడి మొదలైంది. ఈ నెల 27 వ తేదీ నుంచి పదవ తరగతి, వచ్చేనెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండగా ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు 26వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6,7 తరగతులకు మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది.
8వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం పరీక్షలు ఉదయం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు మధ్యాహ్నం ఉంటాయి. 9వ తరగతి విద్యార్థులకు పేపర్–1 ఉదయం, పేపర్–2 మధ్యాహ్నం జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు ఎస్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షలను ఆయా పాఠశాలలు నిర్వహిస్తాయి. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. మే 15వ తేదీ లోగా ప్రమోషన్ జాబితాలను సిద్ధంచేయాలని స్పష్టం చేసింది.
పరీక్షకు గంట ముందే..
ప్రశ్నపత్రాలను జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు ప్రాథమిక పాఠశాలల ప్రశ్నపత్రాలు క్లస్టర్ వారీగా పంపించారు. యూపీ, ఉన్నత పాఠశాలల ప్రశ్నపత్రాల బండిళ్లను ఎప్పటికప్పుడు పరీక్ష రోజున గంటముందు ఎంఆర్‌సీ నుంచి ప్రధానోపాధ్యాయులు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
పదో తరగతి మాదిరిగా వార్షిక పరీక్షలు
వార్షిక పరీక్షలను పదవతరగతి పరీక్షల మాదిరిగా పకడ్బందీగా నిర్వహిస్తాం. ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. పర్యవేక్షణ ఉంటుంది.
శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట
పకడ్బందీగా శ్లాస్ పరీక్ష విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించే శ్లాస్ (స్టేట్ లెవెల్ లెర్నింగ్ అసెస్‌మెంట్ సర్వే) పరీక్షను గురువారం బలిజిపేట మండలంలో పకడ్బందీగా నిర్వహించారు. మండలంలోని గంగా డ డీపీఈపీ, నారాయణపురం, నారాయణపురం–2, నూకలవాడ, గలావల్లి, అజ్జాడ రెగ్యులర్, పలగర, బలిజిపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. బలిజిపేట మండలంలో 4వతరగతి విద్యా ర్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల విజ్ఞానానికి శ్లాస్
సీతానగరం/పార్వతీపురంటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శ్లాస్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు పార్వతీపురం ఎంఈఓ సూరిదేముడు తెలిపారు. మండలంలోని గాదెలవలస జెడ్పీ ఉన్నత పాఠశాల, హోలీక్రాస్ ఉన్నత పాఠశాల (ప్రైవేట్) ఆరోతరగతి విద్యార్థులకు, అలాగే అంటిపేట, జోగింపేట, బూర్జ, నిడగల్లు ప్రాథమిక పాఠశాలల్లో నాల్గవతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేసి పై చదువులకు అవసరమైన తరగతులు నిర్వహిస్తారని తెలిపారు.
నేటినుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు
మండలంలో ఎస్‌ఏ–2 పరీక్షలు ఈనెల 22నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 9గంటలనుంచి 11.30 గంటలవరకు జరుగుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment