కష్టాల ఊబిలో.. | Sufferings of the people of Budameru flooded areas in Bejawada | Sakshi
Sakshi News home page

కష్టాల ఊబిలో..

Published Wed, Sep 11 2024 4:40 AM | Last Updated on Wed, Sep 11 2024 4:44 AM

Sufferings of the people of Budameru flooded areas in Bejawada

బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం

ఇళ్ల చుట్టూ మురుగు..

ఇళ్లలోకి వెళితే అంతా బురద... పాడైన వస్తువులే.. ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలోనే వేలాది కుటుంబాలు 

తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు 

విజృంభిస్తున్న దోమలు.. ప్రజల్లో అంటువ్యాధుల భయం.. ప్రధాన ప్రాంతాలకే ‘ఫైర్‌’ సేవలు

బెజవాడలో బుడమేరు వరద తగ్గింది. కానీ, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏ వీధిలో చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు... ఇళ్లలో చేరిన బురద... పాడైపోయిన వస్తువులు... వాటిని శుభ్రం చేసుకుంటున్న జనం... ఇళ్ల ముందు కంపు కొడుతున్న మురుగు... మొరాయిస్తున్న వాహనాలు... సర్వం కోల్పోయి షాపులను చూసి విలపిస్తున్న చిరు వ్యాపారులు... చేతి వృత్తులవారు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. 

కుటుంబమంతా 10 నుంచి 15 ఏళ్లుగా కష్టపడి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మంచాలు వంటి వస్తువులన్నీ పాడైపోయాయని కన్నీరుపెడుతున్నారు. ఇప్పుడు కోల్పోయినవన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని కుమిలిపోతున్నారు.

మరోవైపు ప్రభుత్వం ఆహారం, తాగునీరుపంపిణీ చేస్తున్నా... అవన్నీ దాదాపు మెయిన్‌ రోడ్లకే పరిమితమయ్యాయని, చిన్న చిన్న వీధుల్లో ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు సాయం అందిస్తున్న ఫైర్‌ సిబ్బంది సేవలు కూడా ప్రధాన వీధులకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పాడి గేదెలను బలి తీసుకున్న వరద  
బుడమేరు వరద పశుపోషకులను నట్టేట ముంచింది. రూ. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి. దీంతో వాటిపై ఆధారపడినవారు అల్లాడిపోతున్నారు. సింగ్‌నగర్‌ లెనిన్‌ సెంటర్‌లో నివాసం ఉంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ్మ, మల్లేశ్వరరావు దంపతులతోపాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి 4 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. తాము చూస్తుండగానే గేదెలు కొట్టుకుపోయాయని, వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.

రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌లో బతికాం
ఈ వ్యక్తి పేరు ఉప్పు శ్రీను. విజయవాడ సింగ్‌నగర్‌లోని కృష్ణా హోటల్‌ సెంటర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన కొద్దిపాటి స్థలంలోనే పక్కపక్కన శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను ఆటో నడిపితే.. భార్య, ఇద్దరు పిల్లలు మట్టి పనులు చేసుకుని పైసాపైసా కూడబెట్టుకున్నారు. శ్రీను తమ్ముళ్లు కూడా మట్టి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా ఈ నెల ఒకటో తేదీ అందరూ పనికి వెళ్లగా, అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ వరద వచ్చింది. 

ఇంట్లో ఉన్న మగ పిల్లలు శ్రీను తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పక్కింటి గోడ దూకించి సురక్షితంగా బయటకు చేర్చారు. కట్టుబట్టలతో కొంత మంది రైల్వేస్టేషన్, మరికొంత మంది బస్టాండ్‌లో వారానికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. దొరికింది తింటూ ఆకలి తీర్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చి శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురి ఇళ్లలోని మంచాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు మొత్తం పాడైపోయాయి. కొత్త బైక్‌ కాస్తా నీటిలోని ఇంజిన్‌ సీజ్‌ అయిపోయింది. 

ఆటోకు, బైక్‌కు ఇన్సూరెన్స్‌ కోసం ఫోన్లు చేస్తుంటే కంపెనీల ప్రతినిధులు మళ్లీ ఫోన్‌ చేస్తామంటూ పెట్టేస్తున్నా­రని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కుటుంబంలోనే రూ.4లక్షలకు పైగా నష్టం జరిగింది. ‘మేం మనుషులం మాత్రమే బతికున్నాం. సర్వస్వం కోల్పోయాం. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా బురదలో కొట్టుకుపోయాయి..’ అని శ్రీను కుటుంబ సభ్యులు విలపించారు.

నీటి కొరతతో ఇబ్బందులు 
కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ, సింగ్‌నగర్, డాబాకొట్లు.. ఇలా అనేక ముంపు ప్రాంతాల్లో బాధితులను నీటి కొరత వెంటాడుతోంది. పది రోజులపాటు జలదిగ్భందంలో ఆయా ప్రాంతాలు ఉండటంతో మున్సిపల్‌ వాటర్‌ పైప్‌లైన్‌లోకి మురుగు నీరు చేరింది. దీంతో చాలాచోట్ల నీటి సరఫరా పునరుద్ధరించినప్పటికీ కుళాయిల ద్వారా వస్తున్న నీటిని వాడుకోలేక­పోతున్నామని ప్రజలు తెలిపారు. 

మరికొన్ని చోట్ల నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. విద్యుత్‌ సరఫరా మొదలైనప్పటికీ ఇళ్లలోకి నీరు చేరడంతో మోటార్‌లు సైతం దెబ్బతిని భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నీళ్ల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు నేటికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.

ప్రధాన వీధులకే ఫైర్‌ ఇంజన్‌ పరిమితం
నీట మునిగిన ఇళ్లను ఫైర్‌ ఇంజన్‌ల సాయంతో శుభ్రం చేస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సింగ్‌నగర్, ఉడా కాలనీ, వాంబేకాలనీ, కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీతోపాటు చాలా ప్రాంతాల్లోని అనేక వీధుల్లో ఇప్పటి వరకు ఫైర్‌ ఇంజన్‌లు వచ్చి ఇళ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రధాన వీధులకు మాత్రమే ఫైర్‌ ఇంజన్‌లు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్లపై ఉన్న మురుగు నీటితోనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.

దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి
వరదల్లో కొట్టుకుని వచ్చిన చెత్తాచెదారంతో డ్రెయి­న్‌లలో నీరు బయటకు వెళ్లడం లేదు. రాజీవ్‌నగర్, పాయకాపురం, ప్రకాష్‌నగర్, రాధానగర్, కండ్రిక, కృష్ణా హోటల్, డాబాకొట్లు సెంటర్, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ, పాత, కొత్త రాజరాజేశ్వరీపేటలు... ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు.

కట్టుకోవడానికి బట్టల్లేవు... పొయ్యి వెలగడం లేదు
లోతట్టు ప్రాంతాల్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇళ్లు వారం రోజులకు పైగానే నీట మునిగే ఉన్నాయి. ముంపు వీడాక ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు 10 రోజుల నుంచి ఉపాధి లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. బయట అప్పు కూడా పుట్టని దుస్థితి. కనీసం పాడైపోయిన గ్యాస్‌ స్టౌ రిపేరు చేయించుకోవడానికి డబ్బులు లేని దీనస్థితి అనేక కుటుంబాల్లో నెలకొంది. 

గ్యాస్‌ ఏజెన్సీలు ఉచితంగా సర్వీస్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాయి. కానీ, స్పేర్‌ పార్ట్‌లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటోంది. వరద నీరు ఇంట్లో చేరడంతో బీరువాలు, ర్యాక్‌లలోకి దుస్తులు వేసుకోవడానికి వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నెల ఒకటో తేదీన కట్టుబట్టలతో ఇళ్లు వదిలిన అనేక మంది బాధితులు నేటికీ వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తుతున్నాం..
నీళ్ల కోసం చీటీలు రాయించుకోవాలా? ఆడవాళ్లంబిందెలు పట్టుకుని రోడ్డు చివరకు ఎలా వెళ్తాం. ఇన్నీ రోజులు వరద నీటిలో మగ్గిపోయాం. బాగాలేని నీళ్ల కోసం కూడా ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. ఇంట్లో టైలరింగ్‌ చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుట్టుమిషన్‌ కూడా వరదలో పొయింది. సరుకు మొత్తం మునిగిపోయింది. 

నా భర్త వాచ్‌మెన్‌గా పని చేస్తారు. పది రోజులుగా ఇద్దరి ఉపాధి పోయింది. తిండికి గతిలేని పరిస్థితి. మా ఇంటిలో చిన్న పాప (మనవరాలు) ఉంది. కనీసం దానికి స్నానం చేయించడానికైనా నీళ్లు కావాలి. లేకుంటే పాపకు ఎక్కడ ఇన్ఫెక్షన్‌ వస్తుందోనని భయమేస్తోంది. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటుంటి సాయం అందలేదు. – కుమారి, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ

మెకానిక్‌ షెడ్‌కు వెళ్లాలంటే గుబులు
వరద వస్తుందని ముందే తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేసిన పాపాన పోలేదు. అలా చేసి ఉంటే ఇంట్లో వస్తువులు, బైక్‌లను అయినా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునే వాళ్లం అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో బైక్‌లు, స్కూటీలు వరద నీటిలో మునిగిపోయాయి. 

ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెడితే బైక్‌ అనేది సర్వసాధారణం. అలాంటి బైక్‌ ముంపునకు గురై పనిచేయలేని దుస్థితిలో ఇంటి ముందే పడి ఉంది. దాన్ని మెకానిక్‌ షెడ్‌ వరకూ నెట్టుకుని వెళ్లి రిపేర్‌ చేయించడానికి ఎంత బిల్లు అవుతుందోనని భయపడుతున్నారు. ప్రస్తుత కష్టాల్లో అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చాలా మంది అలాగే బైక్‌లను వదిలేశారు. 

70 శాతం బైక్‌లకు ఇన్సూరెన్స్‌ ఉండదు
ఒకపక్క సీఎం చంద్రబాబు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను రిపేర్‌ చేయించి పెడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే పాడైపోయిన బైక్‌లలో ఎన్నింటికి ఇన్సూరెన్స్‌ ఫోర్స్‌లో ఉంటుంది? అనే చర్చ బాధితుల్లో నడుస్తోంది. 

సాధారణంగా బైక్‌ను కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే యజమానులు ఇన్సూరెన్స్‌ చేయిస్తారు. అనంతరం 70 శాతం మంది సమగ్ర ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ చేయించరని వాహన, ఇన్సూరెన్స్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటనలతో తమకు మేలు జరగదని చాలామంది బైక్‌ యజమానులు వాపోతున్నారు.

రక్తం పీలుస్తున్న దోమలు
ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్‌ పనులు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే దోమల వ్యాప్తి అధికమై డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కానీ ఆశించినంత వేగంగా ముంపు ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులు సాగడం లేదు. మురుగు, చెత్త మేటలతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. 

దోమల నియంత్రణకు ఫాగింగ్‌ కూడా సక్రమంగా చేయడంలేదని వరద బాధితులు చెబుతున్నారు. చీకటిపడితే చాలు దోమలు రక్తం పీల్చేస్తున్నాయని, ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్నామని, దోమ కాటుతో తమ ఆరోగ్యాలు కూడా గుల్ల అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాతల కోసం ఎదురు చూపులు 
ముంపు ప్రాంతాల్లో మొబైల్‌ రైతు బజార్‌లను ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేస్తోంది. పది రోజు­లుగా జలదిగ్భందంలో ఉండి చేతిలో చిల్లిగవ్వలేని రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు కూర­గా­యలు కొనుగోలు చేయలేక­పోతున్నారు. కొందరు అప్పు చేసి కూరగా­య­లు, సరుకులు కొను­గోలు చేస్తున్నా­రు. అప్పు పుట్టని వారు దాతలు పంపిణీ చేసే ఆహారం కోసం ప్రధాన రహదా­రుల వెంబడి గంటల తరబడి ఎదురుచూ­స్తున్నారు.

రాకపోకలకు అవస్థలే...
అజిత్‌సింగ్‌నగర్‌ నుంచి కొత్త రాజరాజేశ్వరీపేట వైపు వచ్చేందుకు ఉన్న వంతెనపై గుర్రపు డెక్క, బురద పెద్ద పేరుకుపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరీపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా పని కోసం సింగ్‌నగర్‌ వెళుతుంటారు. అటువైపు నుంచి నగరంలోకి వస్తారు.

దుర్వాసన భరించలేకపోతున్నాం..
వరద తగ్గినా మురుగు సమస్య తీరలేదు. సైడు కాలువల్లో వరద ముందుకు పారకపోవడంతో దుర్వాసనవస్తోంది. ఆ వాసన భరించలేకపోతున్నాం. ఒకవైపు వరద నీటిలో ఇల్లు మునిగి వంట సామాన్లు, మంచాలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్, పిల్లల పుస్తకాలు అన్నీ తడిసి పాడైపోయి బాధపడుతుంటే.. మరోవైపు ఈ మురుగు సమస్య వేధిస్తోంది. వరద గురించి ముందుగా హెచ్చరించి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. పగలు వరద వచ్చింది కాబట్టి బతికాం. అదే రాత్రివేళ అయితే ఊహించడమే కష్టం.  – ఎం.దేవకుమారి, మసీదు రోడ్డు, శాంతినగర్‌

పుస్తకాలన్నీ నీటిలో నానిపోయాయి  
తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లోకి వరద నీరు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నా పుస్తకాలతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పుస్తకాలు, రికార్డులను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. పుస్తకాలన్నీ వరద నీటిలోనే నానిపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. 

స్కూలులో ఉన్నప్పుడు జగనన్న ఇచి్చన డిక్షనరీలు మా చదువులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి నీళ్లలో నాని చిరిగిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది మా అక్కచెల్లెళ్ల లక్ష్యం. పుస్తకాలు మళ్లీ కొనాలంటే మా తల్లిదండ్రులకు ఇబ్బందే.   – వర్ష, ఇంటర్‌ విద్యార్థిని, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement