ప్రతి వ్యక్తికీ పనికొచ్చే చట్టం | Sunil Kumar Reveals Shocking Facts Behind Land Titiling Act | Sakshi
Sakshi News home page

ప్రతి వ్యక్తికీ పనికొచ్చే చట్టం

Published Wed, Jan 17 2024 4:59 AM | Last Updated on Wed, Jan 17 2024 4:59 AM

Sunil Kumar Reveals Shocking Facts Behind Land Titiling Act - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం భూమి ఉన్న ప్రతి వ్యక్తికీ పనికొచ్చే చట్టమని భూ చట్టాల నిపుణులు, నల్సార్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌­కుమార్‌ చెప్పారు. ఇది అనాలోచితంగా చేసింది కాదన్నారు. ఈ చట్టాన్ని అర్థం చేసుకోకుండా కొందరు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గతంలో కేంద్రంలో ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయని గుర్తు చేశారు. గత 120 ఏళ్లుగా ఇలాంటి చట్టాన్ని తేవడానికి దేశంలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

కొన్ని రాజకీయ పక్షాలు, న్యాయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా భూములు లాక్కోవడానికి చేసిన చట్టంగా దీని గురించి మాట్లాడడం సరికాదన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం.. ఇతర చట్టాల ద్వారా ఇచ్చిన భూమి హక్కుల్ని లాక్కోదని తెలిపారు. ఉన్న హక్కుల్ని రికార్డు చేసి ఆ హక్కులకు గ్యారంటీ కల్పిస్తుందన్నారు. చుక్కల భూముల చట్టం, ఎస్టేట్‌ ఎబాలిషన్‌ చట్టం వంటి అనేక చట్టాల కింద ఉన్న హక్కులన్నీ ఉంటాయని తె­లి­పారు. ఇది కేవలం ఆర్‌­ఓ­ఆర్‌ చట్టం స్థానంలో వచ్చిన కొత్త చట్టం మాత్రమే­నన్నారు. ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై జరుగు­తున్న రకరకాల ప్రచారాలపై ఆయన సాక్షితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..    

ఒకే ఒక రికార్డు.. ప్రభుత్వం గ్యారంటీ..
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రకారం ఇప్పుడున్న రెవెన్యూ రికార్డులన్నీ మాయమై ఒకే ఒక రికార్డు వస్తుంది. ఆ రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రిజిస్ట్రేషన్‌ జరిగితే హక్కులు రిజిస్టర్‌ అవుతాయి. రిజిస్ట్రార్‌ అమ్మేవాడికి హక్కు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేస్తాడు. రిజిస్ట్రేషన్‌ అయిందంటే కొన్న వ్యక్తి పేరు మీదకు భూమి మారిపోయి­నట్లే. ఇది ఈ చట్టం ద్వారా వచ్చే మార్పు. దీనికి అదనంగా రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది కాబట్టి పొరపాటున ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తుంది. అది టైటిల్‌ ఇన్సూరెన్స్‌. 

సివిల్‌ కోర్టుల అధికారాలన్నీ పోవు..
టైటిల్‌ వివాదాలను సివిల్‌ కోర్టులు పరిష్కరించాలి తప్ప టైటిలింగ్‌ అధికారులు పరిష్కరించడం తప్పని అంటున్నారు. ప్రజలకు సివిల్‌ కోర్టుల్లో తప్ప రెవెన్యూ కోర్టుల్లో న్యాయం జరగదని వాదిస్తున్నారు. కానీ కొత్త చట్టంలో సివిల్‌ కోర్టుల అధికారాలన్నీ పోవు. రికార్డుల తయారు చేసేటప్పుడు వచ్చే అంశాలు మాత్రమే సివిల్‌ కోర్టుల పరిధిలోకి రావు. 

రెవెన్యూ కోర్టులే ప్రజలకు అందుబాటులో ఉంటాయి..
ఇప్పుడున్న భూ రికార్డులన్నీ రెవెన్యూ అధికారులు తయారు చేసినవే. అలాంటప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రకారం కొత్త రికార్డులు తయారు చేయడం వారికి కాకుండా ఎవరికి ఇస్తారు? సివిల్‌ కోర్టుల కంటె రెవెన్యూ కోర్టులే ప్రజలకు ఎక్కువ అందుబా­టు­లో ఉంటాయి. లాయర్‌ లేకుండా కూడా జేసీ దగ్గర మాట్లాడవచ్చు. లాయర్‌ లేకుండా సివిల్‌ కోర్టులో కేసు వేయగలరా? ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే ఇలాంటి వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. సివిల్‌ కోర్టుల్లో 66 శాతం భూమికి సంబంధించిన కేసులున్నాయి. ఈ చట్టం అమలైతే అవన్నీ తగ్గిపోయి సివిల్‌ కోర్టుల్లో భూమి తగాదాలు తగ్గుతాయి. కానీ లాయర్లకు వేరే పని పెరుగుతుంది. టైటిల్‌ వెరిఫికేషన్, ట్రిబ్యునల్‌ అప్పీళ్లు పెరుగు­తాయి. ఇంతకుముందులా ఏళ్ల తరబడి సివిల్‌ కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపించడం కుదరదు. 

అప్పీల్‌కు రెండేళ్లు అవకాశం..
టైటిల్‌ రిజిస్టర్‌లో ఒకసారి పేరు నమోదయ్యాక ఎవ­రికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కి రెండేళ్లు అవ­కా­శం ఇస్తారు. రెండేళ్లలోపు ఎవరైనా అభ్యంతరపెడి­తే అది వివాదాల రిజిస్టర్‌లోకి వెళుతుంది. రెండేళ్ల­లోపు ఎలాంటి అభ్యంతరం రాకపోతే అది తుది రికా­ర్డ­వుతుంది. తర్వాత దాన్ని చాలెంజ్‌ చేయడానికి ఉండదు. ఆర్‌వోఆర్‌ చట్టంలో ఒకసారి రికార్డయితే దాన్ని చాలెంజ్‌ చేయడానికి ఉన్న సమయం సంవత్సరమే. మ్యుటేషన్‌పై అభ్యంతరాలను అప్పీల్‌ చేయడానికి ఉన్న సమయం 19 రోజులు. కానీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంలో రెండేళ్లు అవకాశం ఇస్తు­న్నారు.

ఒక రికార్డును ఎప్పుడో ఒకప్పుడు ఫైనల్‌ చేయకపోతే టైటిల్‌ గ్యారంటీ ఎలా వస్తుంది? ఎవరైనా, ఎప్పుడైనా ఉన్న రికార్డును చాలెంజ్‌ చేసే పరిస్థితి ఉంటే అది అంతిమ రికార్డు ఎలా అవుతుంది? దానికి ప్రభుత్వం గ్యారంటీ ఎలా ఇస్తుంది? ఏ­దో ఒక నిర్దిష్ట సమయం ఉండాలి కదా? సక్సేషన్‌ స­రి­్టఫికెట్‌ సివిల్‌ కోర్టులు ఇవ్వాలిగానీ టైటిల్‌ గ్యారంటీ ఆఫీసర్‌ ఎలా ఇస్తారని అంటున్నారు. కొత్త చట్టంలో సక్సేషన్‌ సర్టిఫికెట్‌ టైటిల్‌ ఆఫీసర్‌ ఇవ్వడు. గతంలో మ్యుటేషన్‌ జరిగినట్లే ఇక్కడా జరుగుతుంది. ఒకవేళ వారసత్వ వివాదాలుంటే సివిల్‌ కోర్టుల­కు వెళ్లాల్సిందే. ఆర్‌ఓఆర్‌ చట్టంలోనూ అదే ఉంది. 

ఇప్పుడున్న వ్యవస్థలో ఫైనల్‌ రికార్డు ఏదీ లేదు..
ఇప్పుడున్న వ్యవస్థలో భూ యజమాని ఆ భూమి నాదని చెప్పుకునే ఫైనల్‌ రికార్డు ఏదీ లేదు. రెవెన్యూ రికార్డులన్నీ ఒకప్పుడు పన్ను వసూలు కోసం తయారైనవే. ఆర్‌ఓఆర్‌ చట్టం మాత్రమే కొద్దిగా ఉపశమనం ఇస్తుంది. పాస్‌బుక్‌ ఉంటే వేరే ఎవరైనా అభ్యంతరం చెప్పనంతవరకు అతనే భూ యజమాని అని ఆ చట్టం చెప్పింది. అంతే తప్ప ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఫలానా రికార్డు.. భూమి హక్కుల నిరూపణకు అంతిమ సాక్ష్యంగా పనికిరాదు. భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పుడు ఇద్దరి మధ్య లావాదేవీ జరిగిన కాగితానికి రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది తప్ప హక్కుల బదలాయింపు కోసం రిజిస్ట్రేషన్‌ జరగదు.

వివిధ ప్రభుత్వ శాఖలు తయారు చేసిన రికార్డుల్లోని వివరాలకు గ్యారంటీ లేదు. అలాగే భూ కమతానికి, ఇంటి స్థలానికి ఐడెంటిటీ లేదు.. హద్దులు కూడా సరిగా లేవు. ఈ సమస్యలన్నింటినీ తీర్చడం కోసమే ఏపీ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి ముందే రీ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దాని ప్రకారం ఎవరి భూముల హద్దులను వాళ్లు చూసుకోవచ్చు. మొబైల్‌ ద్వారా కూడా చూసుకునే సదుపాయంఉంది. ప్రతి వ్యక్తికీ ఆధార్‌ వచ్చినట్లే భూమికి కూడా యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్‌ వస్తుంది. 

ఈ చట్టం ఎవరో ఒకరి కోసం చేసింది కాదు..
ఈ చట్టం ఎవరో ఒకరి కోసం చేసింది కాదు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పనికి వచ్చే చట్టం ఇది. ఏ భూ యజమాని అయినా తన భూమికి స్పష్టమైన హద్దులుండాలని, కాగితాలు స్పష్టంగా, భద్రంగా ఉండాలని, మార్పులు చేర్పులు ఉంటే వెంటనే జరగాలని కోరుకుంటాడు. వివాదాలు వస్తే త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తాడు. ఇప్పటివరకు ఇవన్నీ లేవు కాబట్టే ఈ చట్టం చేశారు. భూమి హక్కులకు భద్రత ఇవ్వడానికి చేసిన చట్టం లాక్కోవడం ఎలా అవుతుంది? రికార్డు తయారైన తర్వాత పబ్లిక్‌ డొమైన్‌లో ఉంటుంది. దానిపై అభ్యంతరం ఉంటే వినాల్సిందే. దానిపై ట్రిబ్యు­నల్‌కు, ఆపైన హైకోర్టుకు కూడా వెళ్లవచ్చు. 

గతంలో అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి.. 
ఈ చట్టం గురించి మాట్లాడుతున్న రాజకీ­య పక్షాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ విధా­నం కావాలని సమర్థించిన పార్టీలే. యూపీ­ఏ హయాంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో టైటిల్‌ గ్యారంటీ చట్టం ఉంది. లెఫ్ట్‌ పార్టీలు అందులో ఉన్నాయి. నీతి అయోగ్‌.. టైటిల్‌ గ్యారంటీ చట్టం రావాలని చెప్పింది. దాని ప్రకారమే ముసాయిదా చట్టా­లు వచ్చాయి. ఎన్డీఏలో అన్ని పక్షాలు దానికి మద్దతిచ్చాయి. ప్రజల కోణంలో చూసినా, రాజకీయ కోణంలో చూసినా ఈ చట్టాన్ని అభ్యంతర పెట్టడానికి అవకాశం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement