‘‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!. వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారు... మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరిన్ని కోర్టులకు వెళుతున్నారు తప్ప... అవి పేదల ఇళ్లే కదా అని వదిలేయటం లేదు. సోమవారం కూడా వీరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కనీసం ‘స్టే’ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ తరఫున వాదించడానికి గతంలో భారత సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్‌గా పనిచేసిన హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారంటే... వీరి వెనక ఎంతటి ఆర్థిక బలమున్న మనుషులున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.
అసలు రాజధాని రైతుల పేరిట దాఖలు చేస్తున్న పిటిషన్లను ఇంతటి ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ హైకోర్టుల్లోను, సుప్రీం కోర్టుల్లోను ఎలా నడిపిస్తున్నారనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. తెలుగుదేశం కూడా వీళ్ల పిటిషన్లకు ఇన్నేసి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుపెడుతోందో... ఒకవంక అలా చేస్తూ మరోవంక రాజధాని ప్రాంతంలో ఆందోళనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి ఎందుకు వెళుతోందో అర్థం కాని విషయం.
అసలు ఆ ప్రాంతంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలివ్వకూడదని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? ఇదేమీ ఆయన సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు కదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఆయన్ని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రాజధాని ప్రాంతంలో పేదలకు ఓ కాలనీ ఉంటే తప్పా? వారూ అందరితో పాటు అక్కడ బతికితే తప్పేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి ప్రాంతంలో 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తూ, రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నివసించేలా సీఆర్‌డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు పేదల ఇళ్ల స్థలాల కోసం శరవేగంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్–5 జోన్‌కి వ్యతిరేకంగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఊట్ల శివయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్ అభయ్.ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం మూడు రాజధానుల పిటిషన్లతో దీన్ని జత చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. అమరావతి భూములకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందన్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వ్యతిరేకించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.
సీజేఐ సూచనల మేరకు..
రాజధానికి సంబంధించి ఇతర వ్యాజ్యాలు మరో ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. ఆయా పిటిషన్లతో వీటిని జత చేస్తామని పేర్కొంటూ శుక్రవారం లోపు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై సీజేఐ సూచనలు తీసుకుని జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందున్న పిటిషన్లతో కలిపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంది. ఈ కేసులో కేవియట్ దాఖలు చేసిన మస్తాన్ వలీ తరఫు న్యాయవాది అభిజిత్‌సేన్ గుప్తా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
పేదల విజయం
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం పేదల విజయమని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీఆర్‌డీఏ చట్టంలోనే ఉందన్నారు. ఒకసారి భూములిచ్చాక వాటిపై ప్రభుత్వానికే హక్కులుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment