
సాక్షి, అమరావతి: సర్జికల్ మాస్క్‌లు, పీపీఈ కిట్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అందరికీ అందుబాటు ధరలోకి వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ఒక్కో సర్జికల్ మాస్కు రూ.9 నుంచి రూ.13 వరకు ఉండేది. ఇక పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) కిట్ అయితే రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అమ్మేవారు. కెఎన్ 95, ఎన్ 95 మాస్కులైతే ఒక్కొక్కటి రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయించేవారు. ఇప్పుడు ఆ ధరలన్నీ దిగొస్తున్నాయి. అప్పట్లో తయారీ సంస్థలు లేకపోవడం, ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి అమ్మేవారు.
ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాస్క్‌లు, పీపీఈ కిట్ల తయారీ సంస్థలు పెరగడం, అక్కడ్నుంచి భారీగా ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు పడిపోయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో 9 రూపాయలున్న మాస్కు ధర.. ఇప్పుడు రూ.2.36 మాత్రమే. 10 రోజుల కిందట మాస్క్‌లు, పీపీఈ కిట్లకు ప్రభుత్వం టెండర్లు పిలవగా.. ఓ సంస్థ మాస్కును రూ.2.36కు, పీపీఈ కిట్‌ను రూ.291కు కోట్ చేసింది. ప్రభుత్వాస్పత్రుల కోసం ముందు జాగ్రత్త చర్యగా.. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మాస్కులకు, 10 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment