జన్మదినం సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
పెందుర్తి: వేదపరిరక్షణ, హైందవధర్మ రక్షణ ధ్యేయంగా శారదాపీఠం ముందుకు సాగుతోందని శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఆదిశంకరుని అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠంలో బుధవారం స్వామి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాగులచవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకలో భాగంగా స్వామి.. పీఠ ఆస్థానదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామికి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా ఆయనకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాదపూజ చేశారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణ చేస్తూ.. మతం కోసం ఏ ఒక్కరూ నోరు మెదపని రోజుల్లోనే తాను నిర్భయంగా మాట్లాడానని చెప్పారు. హిందూమతాన్ని ఉద్ధరించే వారిలో బ్రాహ్మణజాతి తర్వాతే ఎవరైనా ఉంటారన్నారు. కాషాయం జెండా పట్టుకున్నంత మాత్రాన మతం నిలబడదని చెప్పారు. ఇప్పుడైతే హిందూమతం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారన్నారు. భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీశారదాపీఠమని చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాసనతో అభివృద్ధి సాధించిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ప్రఖ్యాతి చెందిందని తెలిపారు. తమ పీఠంలో ఆత్మజ్ఞానం గురించి నిరంతరం చర్చ జరుగుతుంటుందని చెప్పారు.
స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ గురువులు సూర్యచంద్రులతో సమానమన్నారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను విస్మరిస్తే ముప్పు తప్పదని చెప్పారు. శారదాపీఠం విలక్షణమైనదని, యావత్ భారతం పీఠం వైపు చూస్తోందంటే అది గురువుల కృప మాత్రమే అని పేర్కొన్నారు. వేదసభలో వివిధ శాఖలకు చెందిన వందలాదిమంది పండితులు పాల్గొన్నారు. స్వామి చేతుల మీదుగా మూడువేల మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన, ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, దాడి వీరభద్రరావు, భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
స్వరూపానందేంద్ర స్వామికి సీఎం శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం స్వరూపానందేంద్ర స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment