సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లోని సత్తాను వెలుగులోకి తెచ్చేలా ‘ఆడుదాం ఆంధ్ర’ వేదికను సిద్ధం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఈ మెగా టోర్నిలో టాలెంట్ హంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో (క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్) మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపికచేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలు, మండలస్థాయి పోటీల అనంతరం 175 నియోజక వర్గాలు, 26 జిల్లాల స్థాయిలో జరిగే పోటీలను నిశితంగా పర్యవేక్షించనుంది. వీటిల్లో రాణించిన క్రీడాకారుల వివరాలతో ప్రత్యేక జాబితాను తయారు చేయనుంది.
అత్యుత్తమ శిక్షణ దిశగా..
క్రీడాసంఘాల ప్రతినిధులతో పాటు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ‘ఆడుదాం ఆంధ్ర’ నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నాయి. మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నవారిని నేరుగా ఫ్రాంచైజీలే దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువతకు సీఎస్‌కే, ఇతర క్రికెట్ ఫ్రాంచైజీల్లో శిక్షణతో పాటు భవిష్యత్తు సీజన్‌లో జట్టులో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది.
కబడ్డీ, వాలీబాల్లో రాణించిన వారిని కూడా పీకేఎల్, పీవీఎల్‌లకు ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్‌లో అయితే అంతర్జాతీయ క్రీడాకారులు నెలకొల్పిన అకాడమీల్లో ఉత్తమ తర్ఫీదు లభిస్తుంది. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు వారి స్థాయిలను బట్టి వివిధ మార్గాల్లో శిక్షణ లభిస్తుంది. తద్వారా వారి ప్రతిభ మరింత మెరుగుపడనుంది.
ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలతో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నా.. ఇప్పటివరకు సరైన దిశలో నడిపించేవారులేక గ్రామాల్లోనే నిలిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా వారందరినీ గుర్తించే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. రాష్ట్రంలోని క్రీడాసంఘాలతో పాటు ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి క్రికెట్ టాలెంట్‌ను గుర్తించేందుకు ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) అంగీకారం తెలిపింది.
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీలతోనూ శాప్ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. కబడ్డీలో తురుపుముక్కలను ఎంపికచేసే బాధ్యతను ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తీసుకుంది. వాలీబాల్‌లో ప్రతిభను ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సంస్థ ఒడిసిపట్టనుంది. అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లు సహకారం అందించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment