సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానానికి మొదట చేసిన ప్రతిపాదనకే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) మొగ్గు చూపింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా)కు, అక్కడి నుంచి సోమశిల (పెన్నా), అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట (కావేరీ)కు తరలించడం ద్వారా నాలుగు నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి వద్ద మిగులుగా 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు.. వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది.
మహానది–గోదావరిని అనుసంధానం చేశాక.. మహానది నుంచి గోదావరికి తరలించిన జలాలను రెండో దశలో కావేరికి తీసుకెళ్లాలని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 25న ఢిల్లీలో భేటీ కానుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు ఎస్కే హల్దార్, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, ఎనిమిది మంది సభ్యులు, పది మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. ఇతర నదుల అనుసంధానంతో పాటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ భేటీలో వెల్లడైన అంశాల ఆధారంగా మార్చి 4న తిరుపతిలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సులో గోదావరి–కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, కె.పళనిస్వామి, యడియూరప్ప, పి.విజయన్‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంప్రదింపులు జరపనున్నారు.
భాగస్వామ్య రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, ఆ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే గోదావరి నికర జలాల్లో మిగులు జలాలు కన్పిస్తున్నాయని, ఆ రాష్ట్రాలు వాటా జలాలను ఉపయోగించుకుంటే మిగులు జలాలు ఉండే అవకాశం లేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ సంపూర్ణ హక్కు కల్పించిన నేపథ్యంలో.. గోదావరి నుంచి మళ్లించే నీటిలో సింహభాగం ఏపీకే కేటాయించాలని సూచిస్తున్నారు.
ఆ మూడు ప్రతిపాదనలు వెనక్కి
గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ 2019లో మూడు ప్రతిపాదనలు చేసింది. జానంపల్లి, దమ్ముగూడెం, అకినేపల్లిల నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించడం ద్వారా అనుసంధానం చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాక ఈ అనుసంధానంపై చర్చించాలని సూచించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చేసిన మూడు ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ పక్కన పెట్టింది. 2002లో మొదట చేసిన ప్రతిపాదననే మళ్లీ తెరపైకి తెచ్చింది.
అయితే గోదావరి జలాలను ఇతర బేసిన్‌లకు మళ్లిస్తే.. కృష్ణా, కావేరి జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కర్ణాటక, కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీటిపై ఈనెల 25న టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిక ఇవ్వనుంది. మార్చి 4న తిరుపతిలో జరగనున్న సదస్సులో ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకోనున్నారు. నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాకే మిగులు జలాలను మళ్లించాలని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలు స్పష్టం చేసిన నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను కేంద్రం ఎలా ఒప్పిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
చదవండి:
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్
మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం
Comments
Please login to add a commentAdd a comment