గోదావరి టూ కావేరి.. తెలంగాణ దారి | New proposal on godavari and kaveri rivers connectivity | Sakshi
Sakshi News home page

గోదావరి టూ కావేరి.. తెలంగాణ దారి

Published Thu, Dec 21 2017 1:49 AM | Last Updated on Thu, Dec 21 2017 1:49 AM

New proposal on godavari and kaveri rivers connectivity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానంపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన ఈ ప్రక్రియకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. మూడు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లోని వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చేలా కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని సూచించింది. దీనికి మొత్తంగా రూ.45,049 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిని (టెక్నికల్‌ ఫీజబులిటీ నోట్‌) సిద్ధం చేసింది. 

కొత్త అధ్యయనం.. కొంగొత్త అధ్యాయం! 
దక్షిణాదిలో నదుల అభివృద్ధి కోసం ద్వీపకల్ప నదుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నట్లుగా అంచనాలున్న దృష్ట్యా... ఆ నీటిని కృష్ణా, కావేరి పరీవాహకాలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం. 

ఇందుకోసం తొలుత తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దాదాపు ఏడాది పాటు మరుగున పడిన ఈ అంశం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో తిరిగి తెరపైకి వచ్చింది. అయితే ఒడిశాలోని మణిభద్ర ప్రాజెక్టు, తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మించలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీలు లభ్యతగా జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు తమ ప్రాజెక్టులకు వినియోగించుకోగా.. 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని అంచనా వేసింది. దీంతో అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు నీటిని తరలించేలా ప్రణాళిక వేసింది. ఈ కాలువ పెద్దవాగు, కిన్నెరసాని, మురేడు. పాలేరు, మూసీ నదులను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. 

అనుసంధానం ప్రతిపాదనలివీ.. 
ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన తర్వాత గోదావరి నది నిండుగా ప్రవహిస్తుంది. ఇచ్చంపల్లికి 63 కిలోమీటర్ల దిగువన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలుపోగా... 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (సుమారు రెండు టీఎంసీలు) చొప్పున తరలించాలని ప్రతిపాదించింది. 

ఈ ప్రతిపాదనలోని ప్రధాన అంశాలు.. 
– గోదావరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (సుమారు 20 టీఎంసీలు) నిల్వ సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. దీనితో 12 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. అయితే ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదు. 
– అకినేపల్లి బ్యారేజీ నుంచి 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత కాలువ ద్వారా 4.3 కిలోమీటర్ల దూరం తరలిస్తారు. అక్కడి నుంచి తిరిగి 100.57 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. 324.2 కిలోమీటర్ల పొడవున కాలువ, 12.50 కిలోమీటర్ల సొరంగాల ద్వారా గ్రావిటీతో నాగార్జునసాగర్‌కు నీరు చేరుతుంది. 
– నాగార్జునసాగర్‌ కుడిగట్టు వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మిస్తారు. దాని నుంచి 393.02 కిలోమీటర్ల పొడవైన కాలువల(1.265 కిలోమీటర్ల సొరంగం కలిపి)ద్వారా నీటిని సోమశిల (పెన్నా) రిజర్వాయర్‌కు తరలిస్తారు.  
– సోమశిల రిజర్వాయర్‌ కుడిగట్టుపై రెగ్యులేటర్‌ నిర్మిస్తారు. దాని నుంచి కండలేరు వరద కాలువకు సమాంతరంగా 529.19 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరీ నదిపై నిర్మించిన గ్రాండ్‌ ఆనకట్టకు జలాలను చేరుస్తారు. 
– మొత్తంగా ఈ అనుసంధానం పూర్తి చేయడానికి రూ.45,049 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.  దీనిని రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. తొలిదశలో అకినేపల్లి–నాగార్జునసాగర్‌ వరకు.. రెండో దశలో నాగార్జునసాగర్‌–సోమశిల–కావేరీ గ్రాండ్‌ ఆనకట్ట వరకు పనులు చేస్తారు. 

మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. 
నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. 

జలాల తరలింపు ఇలా.. 
గోదావరి నుంచి కృష్ణాకు: 247 
కృష్ణా నుంచి పెన్నాకు: 143 
పెన్నా నుంచి కావేరికి: 88.83 

రాష్ట్రాల వారీగా ఉండే ఆయకట్టు.. (హెక్టార్లలో) 
రాష్ట్రం              ఆయకట్టు 
తెలంగాణ        3,10,200 
ఏపీ               4,04,600 
తమిళనాడు    4,01,400 
మొత్తం          11,16,200 

వ్యయ అంచనాలు ఇవీ.. (రూ.కోట్లలో) 
అనుసంధానం        వ్యయం 
గోదావరి–కృష్ణా    16,868 
కృష్ణా–పెన్నా       14,822 
పెన్నా–కావేరి      13,359 
మొత్తం               45,049

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement