తాడేపల్లిరూరల్/తాడికొండ: వెంకటపాలెంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు అక్కచెల్లెమ్మలు నీరాజనం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు అరాచకం సృష్టించారు. కొంత మందికి మద్యం తాపించి, బస్సుపై రాళ్ల దాడి చేయించారు. ఈ దాడిలో బస్సు వెనుక అద్దాలు పగిలాయి. నులకపేట నుంచి బస్సులో తల్లితో పాటు వచ్చిన ఓ బాలుడి మెడకు తీవ్ర గాయమైంది.
ఎర్రబాలెం ఇండస్ట్రియల్ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన వారు బైక్‌పై పారిపోతుండగా స్థానికులు అడ్డగించారు. బస్సులోని వారు దిగి ఎందుకు రాళ్లతో దాడి చేశారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ తిరగబడే ప్రయత్నం చేశారు. మంగళగిరి రూరల్ సిఐ నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని ప్రశ్నించారు.
‘మాది వెంకటపాలెం. మా పేర్లు బొల్లిబోయిన హరికృష్ణ, యల్లమల్ల సుబ్బారావు. బస్సు మమ్మల్ని ఢీకొట్టబోయింది. దీంతో మాకు కోపం వచ్చింది’ అని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా వారు అక్కడ నిద్రపోయారు.
రైతుల ముసుగులో దాడి: సీఎం వైఎస్ జగన్ సభకు వెళ్లి పలువురు తిరిగి వస్తుండగా తుళ్లూరులోని అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా నల్ల బెలూన్లు, రిబ్బన్లతో దూసుకొచ్చి సీఎం డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు.
అదే సమయంలో మేడికొండూరు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లాం చిన్న రాయప్ప ‘జై జగన్..’ అని నినదించడంతో అక్ష లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు, మహిళలు దాడి చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment