టీడీపీ నేత అమరనాథరెడ్డితో ఎర్రచందనం కేసులో నిందితుడు అభినవ్(ఫైల్)
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నలుగురు నిందితుల్లో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులు ఉండటం, వారిద్దరూ టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథరెడ్డి శిష్యులు కావడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాజుపల్లి క్రాస్ వద్ద కర్ణాటక సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేసి.. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు యువకులను పట్టుకున్నారు. ఆ కేసులో ఏ–4గా ఉన్న ఎంపీటీసీ అభినవ్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దిగిన ఫొటోను టీడీపీ మీడియాతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ వాస్తవమేంటంటే ఏ–4 అభినవ్‌తో పాటు.. ఏ–3 అనిల్ కూడా అమరనాథరెడ్డి శిష్యులుగా తేలింది. అమరనాథరెడ్డితో నిందితులిద్దరూ దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఏ–4గా ఉన్న అభినవ్‌ది బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి.
కొన్నాళ్లు వైఎస్సార్‌సీపీలో ఉన్నా అతని చెడు ప్రవర్తన ముందే పసిగట్టిన జిల్లా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి అతను ముందు నుంచీ అమరనాథరెడ్డి శిష్యుడిగానే పేరొందాడు. టీడీపీ నేతలతోనే సన్నిహితంగా మెలిగేవాడు. ఇక ఇదే కేసులో ఏ–3గా ఉన్న అనిల్‌కుమార్‌ది పలమనేరు పట్టణంలోని బజారువీధి. తాజాగా కర్ణాటక పోలీసులకు చిక్కక ముందు కూడా అమరనాథరెడ్డిని ఆయన గృహంలో కలసి ఆయన్ను ఓ కార్యక్రమానికి ఆహ్వానించాడు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే ముందుగానే భుజాలు తడుముకున్న చందాన వైఎస్సార్‌సీపీ నాయకులతో అభినవ్ ఉన్న ఫొటోలను అమరనాథరెడ్డి తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అభినవ్‌కు తనతో సంబంధాలున్నాయని తెలిసిపోతుందనే భయంతోనే ముందుగానే పచ్చ మీడియాలో హోరెత్తించారని చెప్పుకొంటున్నారు. ఇక ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఎంపీటీసీ అభినవ్‌కు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా సదరు ఎంపీటీసీపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment