నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా వేధిస్తున్నారు?
రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు
వివిధ పోలీస్ స్టేషన్లు, జైళ్లకు తరలిస్తున్నారు
కస్టడీలో ఉన్నా, ఇంటికి వచ్చి నోటీసులంటించారు
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన
సాక్షి, తాడేపల్లి: తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారని అన్నారు. కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. తన భర్త హార్ట్ పేషెంట్ అని కనీసం మెడిసన్ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. తన భర్తను ఇలాగే వేధిస్తే సీఎం చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు ఎలా వేధిస్తున్నారో చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన భర్తపై ఇప్పటికే 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని,. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. భ ర్త వెంట వెళ్తున్నానని తన కారులో గంజాయి పెట్టి మరో కేసు పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్‌పేట, దువ్వాడలో కేసులు పెట్టారు.
అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.
నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, మా కారులో గంజాయి పెట్టి సీజ్ చేయాలని ప్రయత్నించారు.
ఆ తర్వాత విశాఖలోని మహారాణిపేట పీఎస్‌కు పంపి, అక్కడి నుంచి రాజమండ్రిలో రిమాండ్‌కు పంపారు. అక్కడి నుంచి మాచర్ల, తర్వాత కురుపాం, తర్వాత వైజాగ్ సెంట్రల్ జైల్‌కు పంపారు.
పీటీ వారెంట్‌లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్‌కు ఆ తర్వాత సబ్బవరం జైల్‌కు పంపారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకువెళ్ళారు.
రిమాండ్‌లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు.
నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ కలవనీయకుండా పీటీ వారెంట్ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు.
మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆయనను ఒకేచోట అస్సలు ఉంచకుండా దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు. జైళ్లు తిప్పుతున్నారు.
నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్ళు తరలిస్తున్నారు.
12 ఏళ్ళ నుంచి మేం వైఎస్సార్‌సీపీలో పనిచేస్తున్నాం, నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.
నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటాను’ అని సుజన పేర్కొన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్‌లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను అక్రమ కేసులో ఇటీవల దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment