భట్టిప్రోలు గొడవను మరుగున పెట్టేందుకు టీడీపీ నేతల యత్నాలు
టీడీపీ నేతలను నిలువరించిన పోలీసులపై దౌర్జన్యం
ఎస్సై చొక్కా పట్టుకొన్న వీడియో బయట పెట్టింది టీడీపీ నేతలే
ఆ వీడియోలో స్పష్టంగా కనిపించిన వారిద్దరి పెనుగులాట
దానిని మరుగున పెట్టేందుకు బాబు, లోకేశ్ సెల్‌ఫోన్ కథ
దాని మాటున సాక్షి, వైఎస్సార్‌సీపీపై అక్కసు
కింద పడ్డ సెల్‌ఫోన్ తీయాలంటే ఎస్సై చొక్కా పట్టుకోవాలా?
ఇక్కడే దొరికిపోయిన సీఎం బాబు, లోకేశ్, ఇతర నేతలు
మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల పేకాట, కోడి పందేల కేంద్రాల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా బయటపడింది. చిన్న లాజిక్ మిస్సయిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల
నగరం మండలం వెలమవారిపాలెంలో ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పేకాట కేంద్రంలో రోజుకు కోట్లలో ఆట ఆడిస్తున్నారు. ఈ ఒక్క కేంద్రం నుంచే స్థానిక టీడీపీ నేతకు నెలకు రూ. 60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనిని స్థానిక పోలీసుల సహకారంతో నడిపిస్తున్నారు. ఈ కేంద్రాల బారిన పడి వందలాది మంది ఆరి్థకంగా చితికిపోతున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేత వరికూటి అశోక్‌బాబు బయటపెట్డడంతో టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసిరారు. పోలీసులు అశోక్‌బాబును గృహ నిర్బంధం చేయగా, టీడీపీ నేత సాయిబాబు, ఆయన అనుచరులు భట్టిప్రోలులో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరారు. వారిని నిలువరించే సందర్భంలోనే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.
నగరం ఎస్సైని టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకొని నెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునేందుకు అది ఫేక్ అంటూ ఓ సెల్ ఫోన్ కథ అల్లారు. వాస్తవంగా ఈ ఘర్షణను వీడియో తీసింది టీడీపీ నేతలే. గొప్ప కోసం వారు సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త నగరం ఎస్‌ఐ చొక్కా పట్టుకోవడం, వారిద్దరి పెనుగులాట వాటిలో స్పష్టంగా ఉంది.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇతర టీడీపీ నేతలు మాత్రం ఆ వీడియోను ఎడిట్ చేసి, కొత్త కథ అల్లారు. సెల్ ఫోనుకిందపడితే టీడీపీ కార్యకర్త తీసి ఇవ్వబోయాడంటూ కట్టుకథ అల్లారు. కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను చూపించి సాక్షి మీడియా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సెల్ కిందపడితే కిందికి వంగి తీసివ్వాలి తప్ప ఎస్సైతో పెనుగులాడాల్సిన అవసరం ఏముందన్న వాస్తవాన్ని వారు మరిచారు.
పైగా, నలుగురు పోలీసుల మధ్య నుంచి టీడీపీ కార్యకర్త దూరి మరీ ఎస్సై చొక్కా పట్టుకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నింటినీ మరుగునపెట్టి, పేకాట, కోడిపందాల వ్యవహారాన్ని తొక్కి పెట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ కొత్త డ్రామాకు తెరలేపినట్లు టీడీపీ వారి వీడియోలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment