సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మళ్లీ తన నోటి దురుసును ప్రదర్శించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో వంద మందితో కూన రవికుమార్ నిరసనకు దిగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఆర్‌ఈసీహెచ్ ప్రసాద్ శనివారం కూన ఇంటి వద్దకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇంటిలోనే ఉండాలని కూనకు సూచించగా.. ఆయన సీఐపై నోరుపారేసుకున్నారు.
‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను, నీ ఉద్యోగం, నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్‌ను నెట్టేశారు. ‘ఎవడైనా పోలీసు లోపలికి వస్తే మర్యాద ఉండదు’ అంటూ హూంకరించారు.
(చదవండి: AP: గాల్లోని ‘ఆక్సిజన్’ను ఒడిసి పట్టారు!)
‘మీ ఇంటిలోకి ఎక్కడొచ్చాం. రోడ్డుపైనే ఉన్నాం. మీ ఇంటిలోకి రావాల్సిన పని మాకేంటి? మాకున్న సమాచారం మేరకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మీరు బయటికి రాగానే అభ్యంతరం చెప్పాం.. అంతకుమించి ఏం జరగలేదు కదా?’ అని సీఐ సున్నితంగా చెబుతున్నా వినకుండా కూన రెచ్చిపోయారు. దీంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీకాకుళం శాంతినగర్‌లోని బం«ధువు ఇంటిలో ఉన్న కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గలాటాకు దిగి నానా రభస సృష్టించారు.
(చదవండి: కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా)
Comments
Please login to add a commentAdd a comment