సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.242 కోట్ల చిక్కుముడి వీడుతోంది. గత సర్కారు హయాంలో వర్సిటీలు, కాలేజీలకు పరికరాలు సరఫరా చేసినందుకు నిధులు చెల్లించామన్న వాదన కట్టుకథేనని తేటతెల్లమవుతోంది. చంద్రబాబు సర్కారు ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.242 కోట్లు హవాలా మార్గంలో తిరిగి ‘పెద్దలకే’ చేరాయని స్పష్టమైంది. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు నిజమేనని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
చదవండి: ‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా
హవాలా దారిలో రూ.242 కోట్లు
కాంట్రాక్టు నిబంధనలను పాటించకున్నా గత ప్రభుత్వం డిజైన్‌టెక్ కంపెనీకి పూర్తి సానుకూలంగా వ్యవహరించింది. నిబంధనల ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90% నిధులు సమకూర్చాలి. అయితే ఒక్క శాతం కూడా వెచ్చించకున్నా టీడీపీ సర్కారు తన వాటాగా రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అందులో రూ.242 కోట్లను డిజైన్ టెక్ బోగస్ కంపెనీ స్కిల్లర్‌కు చెల్లించింది. స్కిల్లర్ ఆ నిధులను ఏసీఐ అనే మరో షెల్ కంపెనీకి మళ్లించింది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో బురిడీ కొట్టించిన ఏసీఐ కంపెనీ రూ.242 కోట్లను మళ్లీ డిజైన్ టెక్ ఖాతాలోనే వేసింది. ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు విత్‌డ్రా చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినప్పటికీ కంపెనీ రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేకపోవడం గమనార్హం. రూ.242 కోట్లను హవాలా మార్గంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు డిజైన్ టెక్ ప్రతినిధులు చేరవేసినట్లు స్పష్టమైంది. అందుకే వాటికి సంబంధించి రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేవు. ఇలా ఈ నిధులు గత సర్కారు పెద్దల జేబుల్లోకి చేరిపోయాయి.
ఆనాడే గుర్తించిన కేంద్ర జీఎస్టీ...
కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పుణెలోని షెల్ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీ, స్కిల్లర్ తదితర కంపెనీలు సమర్పించిన ఇన్‌వాయిస్‌లన్నీ నకిలీవేనని జీఎస్టీ అధికారుల దాడుల్లో నిర్ధారణ అయ్యింది. తాము ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సరఫరా చేయలేదని ఆ రెండు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. తమ రికార్డుల్లో చూపిస్తున్న రూ.242 కోట్ల లావాదేవీలన్నీ కల్పితాలేనని వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ అధికారులు ఇదే విషయాన్ని 2018లోనే టీడీపీ సర్కారు దృష్టికి తెచ్చారు. రూ.242 కోట్లు దారి మళ్లాయని స్పష్టం చేశారు. దీనిపై గత సర్కారు ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఆ అవినీతి బండారం బట్టబయలైంది.
షా అరెస్టుతో టీడీపీ నేతల్లో గుబులు..
ముంబైకి చెందిన షెల్ కంపెనీల సృష్టికర్త శిరీష్ చంద్రకాంత్ షా అరెస్టుతో టీడీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. రూ.242 కోట్లు హవాలా మార్గంలో తరలించిన ఉదంతంలో తమ పేరు వెలుగులోకి వస్తోందని కలవరం చెందుతున్నారు. చంద్రకాంత్ షా సృష్టించిన షెల్ కంపెనీల ద్వారానే ఏపీఎస్‌ఎస్‌డీసీతోపాటు మరికొన్ని శాఖల్లో కుంభకోణాల నిధులను పక్కాగా దారి మళ్లించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment