సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది.
‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు.
రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా..
తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్‌లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు.
సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment