
రేణిగుంట(తిరుపతి జిల్లా): రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల పేరుతో ఓ మహిళపై బలాత్కారానికి యత్నించిన కామ మాంత్రికుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ నేతలు తిరుపతి సబ్ జైల్లో పరామర్శించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న సుబ్బయ్య శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటలో భూత మాంత్రికుడి అవతారం ఎత్తి దాదాపు పదేళ్ల నుంచి మంత్రాలు, తాయత్తులు కడుతూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ముచేసుకునే వాడు.
తాంత్రిక పూజల ముసుగులో అతని అకృత్యాలు నిత్యకృత్యమైనా.. ఎవ్వరూ అతనిని ఎదిరించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ఈ నెల 14న రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల నెపంతో ఓ మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని బలవంతం చేసి ఆమె నిరాకరించడంతో బలాత్కారం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.
కాగా, సబ్ జైల్లో ఉన్న నిందితుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతిబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయక్, అమాస శివకుమార్‌లు కలిసి అరగంటకు పైగా అతనితో మంతనాలు జరిపారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు. మహిళపై అకృత్యానికి పాల్పడి అరెస్టయిన సుబ్బయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని టీడీపీ వర్గాలే భావించాయి.
అయితే అనూహ్యంగా జైల్లో ఉన్న అతన్ని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి బలహీనతలు సుబ్బయ్యకు బాగా తెలుసని, అవెక్కడ బయటపడతాయోనని పార్టీ వర్గాలు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment