48 డిగ్రీల దిశగా పయనం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. కొద్దిరోజులుగా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు (సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా) నమోదవుతుండగా.. ఇప్పుడు 48 డిగ్రీలకు చేరువగా పయనిస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, గోస్పాడుల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఇంకా అర్ధవీడు (ప్రకాశం)లో 47.3, చిన్నచెప్పలి (వైఎస్సార్) 47.2, వి.అక్కమాంబపురం (నెల్లూరు) 47.1, పెద్దకన్నాలి (తిరుపతి) 46.9, పంచలింగాల (46.8), తవణంపల్లె (చిత్తూరు), రావిపాడు (పల్నాడు)ల్లో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
63 మండలాలు తీవ్ర వడగాడ్పులతో అల్లాడిపోగా.. 208 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 169 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మరింత తీవ్ర రూపం దాల్చి 78 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 273 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment