వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషం
కరోనా కష్టకాలంలో.. సంక్షేమ పథకాల అమలులో వారిదే కీలకపాత్ర
టీడీపీ నేత బొజ్జలపై సర్వత్రా ఆగ్రహావేశాలు
టీడీపీ–జనసేన పార్టీలకు వారంటే కడుపుమంట: ప్రభుత్వ సలహాదారు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి
ప్రజల్లో తేల్చుకుందామా అంటూ వలంటీర్ల సంఘం సవాల్
వలంటీర్లను చూస్తే బాబు కూటమికి భయం : మంత్రి సురేష్
సాక్షి, అమరావతి/వీరపునాయునిపల్లె/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) /కవితి/టంగుటూరు : నిరంతరం ప్రజల సేవలో ఉంటున్న వలంటీర్లను శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి టెర్రరిస్టులతో పోల్చడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ కోణంలో వారిని టార్గెట్ చేయడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి.
సేవే పరమావధిగా ప్రజలకు మంచి చేస్తున్న వీరిని స్లీపర్స్ సెల్స్ అని.. ఉగ్రవాదులు, డేటా చోరీ చేస్తున్నారని అనడం చాలా బాధాకరమని.. సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాష్ట్రంలోని వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను మరచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కూడా వలంటీర్లను తీవ్రంగా విమర్శించారని.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతుండడంతో టీడీపీ, జనసేన పార్టీలకు కడుపుమంటగా మారిందన్నారు.
వలంటీర్ల విశ్వసనీయత, తేల్చుకుందామా?
మరోవైపు.. బొజ్జల సుధీర్‌రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలోకి మీరు, మేము వెళ్దాం.. ఎవరిపట్ల మంచితనం, విశ్వసనీయత, విశ్వాసం ఉందో చూద్దాం అని వలంటీర్లందరి తరఫున కమిటీ సవాల్ విసిరింది. అప్పట్లో సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవలు చేశారని.. అలాగే, ఆ రోజుల్లో సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌కే పరిమితమయ్యారని.. కానీ, వలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు ఆయనకేం తెలుసని ప్రశ్నించింది.
‘అలాంటి వారిపై సుధీర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని, సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వలంటీర్లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగమల్లేష్, ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళిదాస్, ఉపాధ్యక్షులు పూజారి ఉదయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
13 మంది వలంటీర్లు రాజీనామా..
సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీఓ పులి రాంసింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ నాయక్‌లకు రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు.
అవ్వతాతలు, చదువురాని పేదలకు సేవచేసేందుకు సీఎం వైఎస్ జగన్ తమకు అవకాశం కల్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని.. కానీ, టీడీపీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డి లాంటి నేతలు మరోసారి విమర్శించేందుకు అవకాశంలేకుండా రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సచివాలయాలకు చెందిన వలంటీర్లు నిరసన చేపట్టారు.
టీడీపీ అంటేనే టెర్రరిస్ట్ పార్టీ అని వారు మండిపడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవచేస్తున్న వలంటీర్లను జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: మంత్రి సురేష్
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ సారథులుగా సేవలందిస్తున్న వలంటీర్లపై టీడీపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమక్షంలో చెప్పారు. వలంటీర్లను చూస్తే చంద్రబాబు కూటమికి భయం పట్టుకుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల సంగతి తెలుస్తామని గతంలో వారు మాట్లాడారన్నారు.
ప్రజలకు సేవలు చేస్తున్న వలంటీర్లపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వలంటీర్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అలాగే, వలంటీర్లపై టీడీపీ, జనసేసే, బీజేపీ కూటమి పగబట్టిందని విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో విమర్శించారు.
వలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం దారుణమన్నారు. వలంటీర్లపై టీడీపీ కూటమి పగబట్టడం దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో అందరికీ తెలిసిందేనని.. కానీ, వలంటీర్లు అలా కాదని.. వారు అందిస్తున్న సేవలను ప్రజలు మరిచిపోరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment