‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం | Three Step Strategy For Covid Control In AP | Sakshi
Sakshi News home page

‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం

Published Fri, Apr 30 2021 9:12 AM | Last Updated on Fri, Apr 30 2021 9:49 AM

Three Step Strategy For Covid Control In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు సంబంధించి ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్నారు. మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్‌ ఇలా అన్ని విషయాల్లోనూ తక్షణమే వృథా (వేస్టేజీ)ను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి విభాగంలోనూ కొంతమంది అధికారులను పర్యవేక్షణకు నియమించారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వృథాను అరికట్టడం ద్వారా వేలాది మంది పేషెంట్లకు అదనంగా వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది.

ఒక్క ఇంజక్షన్‌ తేడా వచ్చినా కఠిన చర్యలు
వాస్తవానికి కరోనా నియంత్రణకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎక్కువ ఉన్నాయి. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన ఇంజక్షన్లు దాచేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించారు. దీన్ని మొదట్లోనే గుర్తించిన ఔషధ నియంత్రణ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌లను ఎలా? ఎవరికి ఉపయోగించారు? అన్నదానిపై ఆడిట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు ప్రైవేటులో పదివేల పడకలు ఉంటే అందరికీ రెమ్‌డెసివిర్‌ల అవసరం ఉండదు. దీన్నిబట్టి ఎలా చేశారన్నది అంచనా వేయవచ్చు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే స్టాకును ఏరోజు కారోజు నివేదిక తెప్పించి పరిశీలిస్తున్నారు. ఒక్క ఇంజక్షన్‌ తేడావచ్చినా ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

అవసరమున్న వారికే ఆక్సిజన్‌
దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఏపీలో సరిపడా నిల్వలు ఉన్నప్పటికి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది వైద్యులు ఆక్సిజన్‌ శాతం 96గా ఉన్న పేషెంట్లకు కూడా ఆక్సిజన్‌ ఇస్తున్నారు. దీంతో నిజంగా ఆక్సిజన్‌ అవసరమైన వారికి ఆలస్యం అవుతోంది. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఆక్సిజన్‌ నిర్వహణకు జిల్లాల వారీగా, ఆస్పత్రుల వారీగా ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ నిల్వలను పర్యవేక్షిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్‌
కరోనా వ్యాక్సిన్‌ వేయడమనేది తొలిసారి. ఇందులో సిబ్బందికి ఎంతగా శిక్షణ ఇచ్చినా కూడా వృథా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 నాటికి 7.93 శాతం వృథా అయినట్టు తేలింది. వ్యాక్సిన్‌ మొదలుపెట్టిన తొలిరోజుల్లో వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక వయెల్‌ ఓపెన్‌ చేస్తే కనీసం 10 మందికి వేయవచ్చు. కానీ ఒక్కరే వస్తే 9 మందికి వేసే డోసు వృథా అవుతుంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌పై అందరికీ అవగాహన పెరిగి, వేయించుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల వృథా ఉండదని అంచనా. మే 1 నుంచి మరింత పక్కా ప్రణాళికతో వృథా పునరావృతం కాకుండా కార్యాచరణ చేపట్టారు.

ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారికి ఇవ్వండి
వైద్యులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారికి ఇవ్వండి. ఇది మరొకరి ప్రాణాలను కాపాడుతుంది. ఎక్కడా వృథా కానివ్వద్దు. ఆక్సిజన్‌ ఇప్పుడు మనకు చాలా విలువైనది. దేశమంతా దీనికోసం ఇబ్బంది పడుతోంది.
– అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ

రెమ్‌డెసివిర్‌పై నిఘా
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నిటిలోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంపై పూర్తి నిఘా ఉంచాం. తేడా వస్తే కఠిన చర్యలు తప్పవు. ఎవరికి ఎన్ని ఇంజక్షన్లు వేశారో కచ్చితంగా లెక్కచెప్పాల్సిందే.
– రవిశంకర్‌ నారాయణ్, డైరెక్టర్‌ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ

చదవండి: ఏపీ: కోవిడ్‌ చికిత్సకు మరింత ఇద్దాం..  
ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్‌ టెస్టుల ఫలితాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement