
ఏఎన్‌యూలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖేష్ కుమార్ మీనా తదితరులు
కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు
పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
పెదకాకాని: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అక్కడక్కడా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్టు తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
కౌంటింగ్ రోజు డ్రై డేను ప్రకటిస్తున్నామని, 144 సెక్షన్ ఎంతవరకు అవసరమో అంతవరకు విధిస్తామన్నారు. జూన్ నాలుగో తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలతో కలిసి మీనా పరిశీలించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మీడియా సెంటర్‌ను పరిశీలించారు.
ఏడు నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను, డైక్‌మెన్ హాల్లో ఏర్పాటు చేసిన టీవీలను పరిశీలించి.. హాజరైన అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా ఈవీఎంలు భద్రపర్చిన గదులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులుగానీ, వారి ప్రతినిధులు గాని రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్‌గా పరిశీలించుకునేందుకు అవకాశం కలి్పంచామన్నారు. వారి వెంట వివిధ స్థాయిల అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment