సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు కలియుగ దైవం శ్రీనివాసుడు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. ఏడుకొండల స్వామిని అభిషేకించేందుకు గిరిజన తేనెను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదనకు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. గిరిజన తేనె నమూనాలను తీసుకున్న టీటీడీ వాటికి ల్యాబ్‌లలో నాణ్యత పరీక్షలు చేయించింది. స్వచ్ఛత బాగుందనే ఫలితాలు రావడంతో గోవిందుడి అభిషేకానికి గిరిజన తేనె వినియోగించాలని నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను జీసీసీ శుద్ధి చేసి కిలో రూ.298.77 చొప్పున విక్రయిస్తోంది. టీటీడీకి అవసరమైన తేనెను తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..)
ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల కిలోల తేనెను శుద్ధిచేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంత తేనె కావాలనేది టీటీడీ నుంచి ఆర్డర్ రావడమే తరువాయి అని జీసీసీ జనరల్ మేనేజర్ చినబాబు ‘సాక్షి’కి చెప్పారు. తేనెతోపాటు శ్రీవారి నిత్య కైంకర్యాలకు, నైవేద్యానికి వినియోగించే పసుపు, జీడిపప్పును కూడా జీసీసీ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదన చేశామని చినబాబు తెలిపారు.(చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్)
విశాఖ మన్యంలోని పాడేరులో గిరిజనుల నుంచి సేకరిస్తున్న పసుపు నాణ్యతలో నంబర్–1 స్థానంలో ఉంది. గిరిజన పసుపు, జీడిపప్పు శాంపిల్స్‌ను జీసీసీ ఇప్పటికే టీటీడీకి అందించింది. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుపతితోపాటు మరికొన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో గిరిజన తేనె, జీడిపప్పు, ఇతర ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి గిరిజనులకు మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment