సేవలన్నీ అక్కడే... ఊరికో ఆలయం  | Revolutionary change with the establishment of village and ward secretariat system | Sakshi
Sakshi News home page

సేవలన్నీ అక్కడే... ఊరికో ఆలయం 

Published Sun, May 30 2021 6:31 AM | Last Updated on Sun, May 30 2021 8:04 AM

Revolutionary change with the establishment of village and ward secretariat system - Sakshi

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొదమ గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా కొండలపై ఉంటుంది. అటవీ శాఖ అనుమతి లేని కారణంగా రోడ్డు వేయలేని పరిస్థితి. వేసవి కాలంలో తప్ప వర్షాకాలంలో ఆ గ్రామానికి వెళ్లడానికి వీలుపడని పరిస్థితి. మండల కేంద్రం నుంచి 130 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆ ఊరు వెళ్లడానికి ఐదు గంటల సమయం పడుతుంది. అలాంటి కుగ్రామంలో సైతం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఊరి ప్రజలు తమ రేషన్‌కార్డులో కొత్తగా మరొకరి పేరు చేర్చుకోవాలన్నా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం పొందాలన్నా, ఇతరత్రా ఏ పనైనా నిరీ్ణత గడువులోగానే పని జరిగిపోతోంది. ఇప్పటి వరకు 513 వినతులు పరిష్కారమయ్యాయి.   

ఒకప్పుడు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం రావాలంటే మండల ఆఫీసు చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు దరఖాస్తు చేసిన 45 రోజుల్లోనే మంజూరు చేస్తున్నారు. ఆ వెంటనే డిజిటల్‌ పాస్‌ పుస్తకం ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రింట్‌ చేసిన పట్టాదారు పుస్తకాన్ని వలంటీర్‌ ద్వారా సంబంధిత వ్యక్తుల ఇంటి వద్దకే పంపుతున్నారు. బియ్యం కార్డు, పింఛన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు.. తదితర సేవలన్నీ ఇలానే నిరీ్ణత వ్యవధిలో అందుతున్నాయి. 

సాక్షి, అమరావతి: సరిగ్గా రెండేళ్ల క్రితం వరకు బియ్యం కార్డు కావాలన్నా, పింఛన్‌ మంజూరు చేయించుకోవాలన్నా ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. వాళ్లకు అంతో ఇంతో ముట్టజెప్పందే పని అయ్యేది కాదు. అయినా కొంత మందికే అవి మంజూరయ్యేవి. ఎవరైనా పింఛన్‌ తీసుకుంటున్న వారు మృతి చెందితేనే మరొకరికి అవకాశం కల్పించే దుస్థితి. రెండేళ్లుగా రాష్ట్రంలో ఈ పరిస్థితి మారిపోయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతానికే చెందిన 10–12 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు నిర్ణీత వ్యవధిలో స్థానికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పని ఉన్నా ఊళ్లోని సచివాలయానికి వెళితే చాలు. కనీసం 200 ఇళ్లు ఉండే ఊళ్లలో, పట్టణాల్లోని వార్డుల్లో సచివాలయం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 11,168, పట్టణ ప్రాంతాల్లో 3,842 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు పంచాయతీ కార్యదర్శి కూడా లేని గ్రామాల్లో ఇప్పుడు వెటర్నరీ అసిస్టెంట్, సర్వేయర్, లైన్‌మెన్, ఏఎన్‌ఎం, మహిళా పోలీసు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తదితరులు అందుబాటులో ఉన్నారు. రెండేళ్ల క్రితం గ్రామాల్లో 19 రకాల ప్రభుత్వ సేవలే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 545కు పెరిగింది.  

అడుగడుగునా పారదర్శకత 
► గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు.. గ్రామాలలో ఎవరికి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందో ఆ ఊళ్లో వాళ్లకు సైతం సరిగా తెలిసేది కాదు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందకపోతే ఎవరిని అడగాలో తెలిసేది కాదు.   
► ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయంలో ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ కనిపించేలా నోటీసు బోర్డులో పెడుతున్నారు. ఎవరి దరఖాస్తును అయినా తిరస్కరిస్తే, అందుకు గల కారణాన్ని కూడా సూచిస్తూ వివరాలు నోటీసు బోర్డులో ఉంచుతున్నారు. 
► సచివాలయాల్లో ప్రస్తుతం ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్‌ పద్ధతిలోనే అమలవుతున్నాయి. ప్రతి చోటా రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక ల్యామినేషన్‌ మిషన్, ఐరిష్‌ స్కానింగ్‌ మిషన్, ప్రతి ఉద్యోగి వద్ద ఒక ఫింగర్‌ ప్రింట్‌ మిషన్‌ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయాల కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా చేపట్టింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సమానంగా 545 రకాల సేవలు అందిస్తోంది. నిర్ణీత వ్యవధిలో సేవలు అందించేందుకు 200 మందితో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం పనిచేస్తోంది. 

‘సచివాలయ’ వ్యవస్థలో ప్రతిదీ ఓ రికార్డే.. 
► అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సచివాలయాల్లో పని చేసేందుకు 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించారు. ఆరు నెలల సమయంలోనే వాటిని భర్తీ కూడా చేశారు. ఇన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్‌ ఇచ్చి, త్వరితగతిన భర్తీ చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయింది.   
► దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడితే.. చిన్న తప్పు కూడా దొర్లకుండా యూపీఎస్‌సీ స్థాయిలో రాత పరీక్షలు నిర్వహించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోపే ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందజేశారు.  
► గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పని తీరును ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాయి. కేంద్ర ప్రభుత్వం సహా ఎన్నో సంస్థలు ప్రశంసించాయి.  

2.32 కోట్ల వినతులు పరిష్కారం  
► 2020 జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో 545 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సచివాలయాల్లో 2,38,72,357 వినతులకు ప్రజలు దరఖాస్తు చేసుకోగా, 2,32,99,642 వినతులను సచివాలయ సిబ్బంది పరిష్కరించారు. 
► కొన్ని సేవలు అప్పటికప్పుడు, మరికొన్ని 72 గంటల్లో, ఇంకొన్ని సాధ్యమైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించేలా నిరీ్ణత కాల పరిమితిని విధించారు.  34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రతి అభివృద్ధి సమాచారం గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.    

జగన్‌ బాబు లేకపోతే.. ఏమైపోయేవాళ్లమో!  
నాకు కళ్లు సరిగా కనిపించవు. పెద్ద కొడుకు కొన్నేళ్ల కిందట  చనిపోయాడు. ఆ తర్వాతి ఏడాదే నా భర్త కూడా కాలం చేశాడు. చిన్నబ్బాయి కిరణ్‌కు విద్యుత్‌ షాక్‌ తగలడంతో రెండు చేతులూ తీసేశారు. జగన్‌ బాబు లేకపోతే మేము ఏమైపోయేవాళ్లమో. నెలనెలా 1వ తేదీనే వలంటీర్‌ ఇంటికే వచ్చి రూ.2,250 పింఛన్‌ ఇస్తున్నారు. చిన్నబ్బాయికి దివ్యాంగ పింఛన్‌ వస్తోంది. 
– నాగమ్మ, పెదకూరపాడు, గుంటూరు  

నా ఆయుష్షు పెంచారు 
పదేళ్ల కిందట నాకు కిడ్నీ సమస్య వచ్చింది.  భార్య, బిడ్డల తప్ప ఎవరూ పట్టించుకోలేదు. పాదయాత్ర చేస్తూ మా ఊరుకు వచ్చిన జగన్‌.. నాకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు నెలనెలా డయాలసిస్‌కు రూ.10,000 ఇస్తున్నారు. జగన్‌ రూపంలో దేవుడే నా ఆయుష్షు పెంచాడు. 
– పొడియా మదన్, శ్రీహరిపురం, శ్రీకాకుళం
 

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక.. ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్‌ ఇస్తున్నారు. పింఛన్‌ను ప్రభుత్వం రూ.వెయ్యి నుంచి రూ.2,250కి పెంచింది. దీన్ని దశలవారీగా రూ.3 వేల వరకు పెంచనున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం 14,17,304 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు సాయం చేస్తోంది. 

మా జగనన్న బంగారం 
జగనన్న అధికారంలోకి రాగానే మా సంఘం అప్పు రూ.7,50,972 మాఫీ కాబోతోందని అధికారులు సమాచారం ఇచ్చారు. తొలి విడతగా వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.1,87,743 రుణ మాఫీ నిధులు మా సంఘం ఖాతాలో జమయ్యాయి. మా సంఘం ఏర్పడి 15 ఏళ్లు అవుతోంది.  ఇలా రుణ మాఫీ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తొలి విడత డబ్బుల్ని డ్రా చేసి, అందరం సమానంగా పంచుకున్నాం. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి ఇస్తామన్న గత ప్రభుత్వ మాటలను మేమెవ్వరం మరచిపోలేదు. జగనన్న ఇచ్చిన డబ్బు విలువ మాకు తెలుసు. అందుకే జగనన్న గుర్తుగా అందరం తోచిన మేర బంగారం కొనుక్కున్నాం. మా జగనన్న బంగారం.  

వైఎస్సార్‌ ఆసరా  
ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన మాటను నిలుపుకుంటూ తొలి విడత మొత్తాన్ని 2020 సెపె్టంబర్‌ 11న వారికి అందజ సింది.  

ఆ డబ్బు వస్తుందనుకోలేదు.. 
నా భర్త పేరు సుధాకర్‌ నాయుడు. మాకు ఇద్దరు సంతానం. నేను మిషన్‌ కుడతాను. మా ఆయన చిన్న చిన్న పనులకు వెళుతుంటాడు. ఇద్దరం పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. మాకు తెలిసిన వాళ్లు చెప్పడంతో అగ్రిగోల్డ్‌లో చేరాం. కంతులన్నీ కట్టిన తర్వాత ఆ సంస్థను మూసేయడంతో ఎంతో బాధపడ్డాం. ఎన్నోసార్లు ఏడ్చేశాం. ఎవరూ మా బాధను అర్థం చేసుకోలేదు. అప్పుడే జగనన్న పాదయాత్ర జరుగుతోంది. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని అన్న చెప్పడంతో ఊరట చెందాం. జగనన్న చెప్పిన విధంగా రూ.10 వేలలోపు బాండ్లకు మోక్షం కలిగించారు. అందులో నాకు రూ.10 వేలు పడ్డాయి. ఆ డబ్బుతో కుట్టు పనికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేశా. ఫలితంగా నేడు రోజూ రూ.500 సంపాదిస్తున్నా. జగనన్న సాయం మాకు పెద్ద ఊరటను కలిగించింది. 
– ఇందిర, అగ్రిగోల్డ్‌ బాధితురాలు, కర్నూలు

అగ్రిగోల్డ్‌
విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు కలిసి 1995లో ‘అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ స్థాపించారు. అధిక వడ్డీ ఆశ చూపి ఏపీతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేశారు. నిర్ణీత గడువు తర్వాత ప్రజలకు డిపాజిట్లు తిరిగి చెల్లించ లేదు. దీంతో బాధితులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాము అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  

ప్రభుత్వం ముందు ‘చూపు’
నేను టైలరింగ్‌తో పాటు వ్యవసాయ పనులు చేసుకుంటున్నాను. కొన్నేళ్లుగా కంటి చూపు సమస్యతో బాధ పడేవాడిని. ఓ రోజు మా గ్రామ సచివాలయం సోదనపల్లికి కంటి డాక్టర్‌ వచ్చారని, వెళ్లి చూపించుకోవాలని వలంటీర్‌ చెప్పారు. అక్కడికి వెళితే కంటి పరీక్షలు చేశారు. నాకు అద్దాలు అవసరం అని చెప్పారు. నా ఆధార్‌ కార్డు అడిగారు. నంబర్‌ నమోదు చేసుకొని, ప్రభుత్వం అద్దాలు పంపిస్తుందని చెప్పారు. నెల రోజులు తిరక్కుండానే కంటి అద్దాలు   మా ఇంటి వద్దకు వచ్చి అందజేశారు. ఇప్పుడు నా కళ్లు బాగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రికి పోయి ఉంటే ఎంత ఖర్చయ్యేదో!  ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ముందు ‘చూపు’తో వ్యవహరిస్తోంది.  
– అల్లీసాబ్, ఈస్ట్‌ నరసాపురం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా  

వైఎస్సార్‌ కంటి వెలుగు
ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యతో బాధ పడకూడదన్న ఉద్దేశంతో వివిధ దశల్లో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టారు. 2,621 మంది విద్యార్థులకు ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు.  అవ్వా తాతలు 72,416 మందికి కేటరాక్ట్‌ ఆపరేషన్లు  ఉచితంగా చేస్తున్నారు. 

ఇలా ఎవ్వరూ ఆదుకోలేదు 
నాకు భార్య, ఇద్దరు కుమారులు. 15 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వాహన మిత్ర పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆటో డ్రైవర్‌ అయిన నాకు రూ.10 వేల చొప్పున ఇప్పటికి రెండుసార్లు బ్యాంకు అకౌంట్‌లో జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్ల బాధలు అర్థం చేసుకోలేదు, ఆదుకోలేదు. ప్రతి ఏటా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు అందజేస్తున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ డబ్బును ఏటా ఆటో ఇన్సూరెన్స్, సీట్లు, కవర్లు, రంగులకు ఉపయోగిస్తున్నా. గతంలో చేతి నుంచి పెట్టుకునేవాళ్లం. ముందుగానే తేదీ చెప్పి ఈ సాయం అందిస్తుండటం గొప్ప విషయం. ఓ వైపు కోవిడ్‌ కష్టాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికి సీఎం సాయం చేస్తుండటం చిన్న విషయం కాదు. 
– మిడుతూరి రాజు, వీసీ కాలనీ, నంద్యాల, కర్నూలు జిల్లా 

వైఎస్సార్‌ వాహన మిత్ర
2019లో మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఆపన్న హస్తంగా నిలిచింది. ప్రభుత్వం వీరికి ఏటా రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. 

ఆరు దశాబ్దాల కల సాకారం 
కడు పేదరికాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నాం. రైస్‌ మిల్లులో డబ్బా మోస్తేనే ఆ రోజు కడుపు నిండేది. 75 ఏళ్లు నిండినా కాయకష్టం తప్పడం లేదు. 50 ఏళ్లు దాటిన కుమార్తె (పెళ్లి కాలేదు)తో కలిసి ఉంటున్నాను.  నివశించడానికి ఇల్లు లేక రోడ్డు పోరంబోకు స్థలంలో గుడిసె వేసుకుని కాలం గడుపుతున్నాం. నా భర్త శ్రీపాద సత్యన్నారాయణ పెళ్లి అయిన పదేళ్లకే చనిపోయాడు. ఆరు దశాబ్దాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తులు చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాలలో ఇంటి స్థలం కోసం తిరగని కార్యాలయం లేదు. కూలిపోతున్న పూరి గుడిసెలో కుమిలిపోతూ జీవనం గడిపాం. జగన్‌ బాబు హయాంలో ఒకే ఒక్క దరఖాస్తుతో మాకు ఇంటి స్థలం వచ్చింది. ఎంతో ఆనందంగా ఉంది. రేషన్‌ బియ్యం ఇస్తున్నారు. తినడానికి ఇబ్బంది లేదు. ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు. జగన్‌ బాబుకు దండాలు.  
– శ్రీపాద సరోజిని, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా  

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలు 30,75,755 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ఇందుకోసం వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరుతో 17,005 లేఅవుట్లు వేసింది. ఇప్పుడు ఆ కాలనీలు ఊళ్లుగా మారనున్నాయి. తాను అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తానన్న హామీ  కంటే ఎక్కువగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలంలో పారదర్శకంగా పట్టాలిచ్చారు. సుమారు రూ.6,800 కోట్లతో ఆ కాలనీల్లో తాగు నీరు, రోడ్లు, డ్రైనేజి, విద్యుత్, పార్కులు, పాఠశాలలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు.  

చేనే‘తల రాత’ మారింది 
రెండేళ్ల క్రితం వరకు చేనేతలు ఎన్నో కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వాలు ఎన్నెన్నో హామీలు ఇచ్చినా నెరవేర్చిన పాపాన పోలేదు. ఎంతో మంది కార్మికులు పూట గడవక ఇబ్బందులు పడ్డారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే ఇచ్చిన మాట మేరకు చేనేతల కష్టాలు తీర్చారు. మా ఊళ్లోని సాంబమూర్తి చేనేత సహకార సంఘంలో నేను సభ్యుడిని. ఈ సంఘంలో 20 మగ్గాలపై పని చేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికి 2019–21 సంవత్సరాల్లో రెండు దఫాలు కలిపి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద ప్రభుత్వం రూ.48 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని నూలు కొనుగోలుకు పెట్టుబడిగా ఉపయోగించుకుంటున్నాం.  
– కుందెం చిన అప్పారావు, బంగారయ్యపేట, కశింకోట మండలం, విశాఖపట్నం జిల్లా 

వైఎస్సార్‌ నేతన్న నేస్తం  
సొంత మగ్గం కలిగి, దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ద్వారా ప్రభుత్వం ఏటా రూ.24 వేల చొప్పున ఆరి్థక సాయాన్ని అందిస్తోంది. 2019 డిసెంబర్‌ 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో కష్టాలు పడుతున్న చేనేత కారి్మకులను ఆదుకునేందుకు 2020 డిసెంబర్‌ 21 వరకు ఎదురు చూడకుండా జూన్‌లోనే ఆర్థిక సాయం అందించారు. అర్హులకు అందలేదనే మాట రాకుండా ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో 2020 నవంబర్‌ 11న మరో 8,903 మందికి రూ.21 కోట్ల 36 లక్షల 72వేలు సాయం అందించారు. ఇలా రెండు విడతల్లోను మొత్తం రూ.383 కోట్ల 79 లక్షల 36 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తం చేనేతలను చాలా వరకు ఆదుకుంటోంది.  

పాడి గేదె కొనుక్కున్నా.. 
నా భర్త చనిపోయి 15 సంవత్సరాలైంది. నా అన్న వారు ఎవరూ లేరు. చాలా ఇక్కట్లు పడుతూ జీవనం నెట్టుకొస్తున్నా. అప్పు చేసి పాడి గేదెను కొనుక్కుని, పాలమ్ముకుని బతుకుదామనుకునేదాన్ని. అప్పు ఇవ్వడానికి ఎవరూ కనికరించలేదు. జగనయ్య ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్‌ దేవి మా ఇంటికి వచ్చి కాపు నేస్తం పథకం గురించి చెప్పింది. రూ 15 వేలు ఇస్తారని, తిరిగి చెల్లించక్కరలేదని చెప్పింది. దరఖాస్తుపై సంతకం చేయించుకుని, ఫొటోలు తీసుకుని వెళ్లింది. ఇలాంటివి చాలా చూశాను.. ఇస్తారేంటి అనుకున్నాను. నిరుడు జూన్‌ నెలలో నా బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15 వేలు పడిందన్నారు. బ్యాంకుకు వెళ్లి తీసుకునే వరకు నమ్మలేదు. ఆ సొమ్ముకు మరి కొంత అప్పుచేసి పాడిగేదెను కొనుక్కున్నాను. పాలమ్మగా వచ్చే డబ్బుతో ప్రతి నెలా కొంత అప్పు తీరుస్తూ ఆనందంగా బతుకుతున్నాను.  
– ముమ్మిడి రాఘవ, పెదకొత్తూరు, కరప మండలం, తూర్పుగోదావరి జిల్లా 

వైఎస్సార్‌ కాపు నేస్తం  
రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది. 45 నుండి 60 ఏళ్లలోపు ఈ కులాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఏటా రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకంలో అర్హులకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు పంపిణీ చేశారు. ఈ మొత్తంతో కొందరు, మరింత సొమ్ము జమ చేసుకుని మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ప్రభుత్వ సాయం వల్ల ఇన్నాళ్లకు తమకు ఉపాధి దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement