
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏ మాత్రం అవసరంలేని, ప్రాధాన్యతలేని, ఇతర సాధారణ జీవోలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. మెడికల్ బిల్లులు, పెట్రోల్ అలవెన్సులు, ఇతర చెల్లింపులు తదితరాలకు సంబంధించిన జీవోలు ప్రజలకు అంత అవసరంలేదని, అందుకే వాటిని వెబ్‌సైట్‌లో ఉంచడం లేదని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ హైకోర్టుకు వివరించారు. ఇందులో దాచేందుకు ఏమీలేదని తెలిపారు. మిగిలిన జీవోలను విడుదలైన వారం రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నామన్నారు. అత్యవసర జీవోలను మరుసటిరోజే అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.
జీవోల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై ఈ నెల 22న విచారిస్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలు విచారణ జాబితాలో ఉన్నప్పటికీ విచారణకు నోచుకోని వీటిపై అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ల న్యాయవాదులు బుదవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యధిక జీవోలను ప్రభుత్వం అప్‌లోడ్ చేయకుండా గోప్యత పాటిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచడం వల్ల నష్టమేముందని ప్రశ్నించింది. జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదేగా అని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ప్రజలకు అవసరంలేని, ప్రాధాన్యతలేని, సాధారణ జీవోలనే వెబ్‌సైట్‌లో ఉంచడం లేదని తెలిపారు. మిగిలిన జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాల్లో విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment