టిడ్కో గృహాల శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: పేదలందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 2,272 గృహాలను మంత్రి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు.
ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఫేజ్–1 కింద నిర్మించిన 4,512 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 2,272 గృహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మిగిలిన గృహాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మరో 1,008 గృహాల పనులు త్వరగా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, దుష్టచతుష్టయం ఓర్వలేక విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, టిడ్కో ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ జి.ప్రసాదరావు, మెప్మా పీడీ వెంకటనారాయణ, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment