రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి | Vijaya Sai Reddy On Women reservation Bill In Rajya Sabha | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో శ్రీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

Published Thu, Sep 21 2023 4:38 PM | Last Updated on Thu, Sep 21 2023 5:06 PM

Vijaya Sai Reddy On Women reservation Bill In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలిలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లుకు విస్పష్టంగా మద్దతు తెలుపుతోందని ఆయన ప్రకటించారు.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండలిలో మహిళల రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని అన్నారు. రాజ్యసభ, మండలిలో సభ్యులు తమ టర్మ్‌ పూర్తవగానే రిటైర్‌ అవుతుంటారు. అందువలన రెండేళ్ళకు ఒకసారి ఖాళీలు ఏర్పడుతుంటాయని అన్నారు. కాబట్టి రాజ్యసభ, మండళ్ళలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80, 171లను సవరించాలని ఆయన న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే చారిత్రాత్మకమైన బిల్లును ఈరోజున సభలో ప్రవేశపెట్టినందున ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్‌ మాసాన్ని చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీలో మహిళలకు 50 శాతానికి మించే రిజర్వేషన్‌...
1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్‌ను సవరించడం ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్‌ కల్పించడం జరిగిందన్నారు విజయసాయిరెడ్డి. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చట్టబద్దంగా నిర్దేశించిన 33 శాతానికి మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మహిళకు ఏ విధంగా పెద్ద పీట వేసిందో గణాంకాలతో సహా ఆయన వివరించారు.

స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు తెలిపారు. 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో ఏడింటిని మహిళలకు (54 శాతం) కేటాయించడం జరిగింది. అలాగే 26 జిల్లా పరిషత్‌ వైఎస్‌ చైర్మన్‌ పోస్టులు ఉంటే 15 పోస్టులను (58 శాతం) మహిళలే అలంకరించారు. మునిసిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పోస్టులలో 50 శాతం...అంటే 18 పోస్టుల్లో మహిళల నియామకం జరిగింది.

671 మునిసిపల్‌ కార్పొరేషన్‌, వార్డు సభ్యుల పదవుల్లో 53.8 శాతం పదవులు మహిళలకే దక్కాయి. రాష్ట్రంలోని 73 మునిసిపల్‌ చైర్మన్‌ పదవుల్లో 45 మంది మహిళలు (62 శాతం) చైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యారు. 2,124 మునిసిపల్‌ వార్డు సభ్యుల పదవుల్లో 1,061 పదవులకు మహిళలే ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్‌లలో 57 శాతం, ఎంపీటీసీలలో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీలలో 53 శాతం మహిళా సభ్యులే ఉన్నారు.

అలాగే వార్డు, విలేజ్‌ వలంటీర్లలో 53 శాతం, వార్డు, గ్రామ సచివాలయ అధికారుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమంలో మహిళలకు సగభాగం అవకాశం కల్పిస్తూ మహిళా సాధికారికత కోసం సీఎం జగన్‌ ప్రభుత్వం చేపడుతున్నచర్యలు తమ చిత్తశుద్ధికి నిదర్శనమని విజయసాయి రెడ్డి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement