
సాక్షి, అమరావతి బ్యూరో: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరో మారు వాయిదా పడింది. తొలుత దీనిని ఈ నెల 4న ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం వైఎస్ జగన్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో ప్రారంభోత్సవం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో సంతాప దినాలు కొనసాగాయి. అందువల్ల ఈ నెల 8కి మార్పు చేశారు. కానీ వివిధ కారణాలతో 18వ తేదీకి మళ్లీ వాయిదా వేశారు. (కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు చివరి సామర్థ్య పరీక్షలు )
అయితే తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి వాయిదా పడింది. అయితే తదుపరి ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎనిమిది నెలల కిందట పూర్తయిన బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ కూడా శుక్రవారమే జాతికి అంకితం చేయాల్సి ఉంది. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ తరహాలోనే కనకదుర్గ ఫ్లైఓవర్‌పై నుంచి కూడా వాహనాలను అనుమతిస్తారని భావించారు. కానీ ఇప్పటికిప్పుడు అలా అనుమతించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేశారు.
కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ అనుమతించం
కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ రాకపోకలను అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ అనుమతించే తేదీ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరికొంత సమయం వేచి ఉండాలని ఆయన కోరారు.