అవి సర్కారు హత్యలే! | Vijayawada police lockup death case is creating a sensation across the country | Sakshi
Sakshi News home page

అవి సర్కారు హత్యలే!

Jun 20 2026 4:22 AM | Updated on Jun 20 2026 4:23 AM

Vijayawada police lockup death case is creating a sensation across the country

తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సీపీ, డీజీపీ చుట్టూ నెల రోజులు తిరిగినా బాధిత కుటుంబాల ఆక్రందన అరణ్య రోదనే.. 

పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్‌ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో

మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్న విజయవాడ  టాస్క్ఫోర్స్‌ పోలీసులు  

బాస్, బిగ్‌బాస్‌ ఆశీస్సులతోనే ఈ అమానుషకాండ 

న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతతో వాస్తవాలు బట్టబయలు 

బాధిత కుటుంబాలకు అండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  

దాంతో గత్యంతరం లేక దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 

సీఐ నాగరాజుపై నామమాత్రపు చర్యలు...తూతూ మంత్రంగా విచారణ ఎత్తుగడ 

కూటమి సర్కారు దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ.. సర్వత్రా ఆగ్రహావేశాలు.. ఉద్యమానికి ప్రజా సంఘాలు సన్నద్ధం  

సాక్షి, అమరావతి:   కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్‌లోనే ‘కనుమరుగు’...! 
పోలీసుల థర్డ్‌డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్‌ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! 

ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్‌ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు.  

ఇంత బరి తెగింపా బాబూ...! 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్‌ లాకప్‌లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్‌లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్‌లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు.  

ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... 
బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్‌ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ... విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు.  అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. 

ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు.  అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది.  

న్యాయస్థానం జోక్యం...  
తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్‌కు పంపించి చేతులు దులిపేసుకుంది.   

వైఎస్‌ జగన్‌ రాకతో... తప్పనిసరై 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్‌ జగన్‌ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్‌లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.   

బుకాయించి.. బెదిరించి! 
ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్‌ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. 

అసలు క్రాంతి కుమార్‌ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్‌ అంత్యక్రియలు పూర్తి చేయించారు.   

దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. 
దళిత యువకుడు క్రాంతి కుమార్‌ ఆత్మహత్య చేసు­కుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో  క్రాంతి కుమార్‌ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభు­త్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement