సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటు పరం కానిచ్చేది లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎంతోమంది ప్రాణత్యాగ ఫలమని, వారి త్యాగాన్ని వృథాకానివ్వం అంటూ తెగేసి చెబుతున్నాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి భవిష్యత్ తరాలకు ప్లాంట్‌ను అప్పగిస్తామంటున్నాయి. ఒకప్పుడు 10%, 20% షేర్లు.. డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్రం.. ఈసారి వ్యూహాత్మక అమ్మకం(స్ట్రాటజికల్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆరాటపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
గనుల కేటాయింపులో వివక్ష
దేశంలోని ప్రయివేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడంలోమాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. ఫలితంగా ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా, సొంత గనుల్లేని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలు చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లు పైనే అయ్యాయి. అయితే స్టీల్ ప్లాంట్ గత 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ.40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం.
సరళీకృత విధానాల పేరుతో..
ఆర్థిక సరళీకృత విధానాల పేరిట అప్పటి యూపీఏ, ఆ తర్వాత వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వాలు చాలా కాలంగా స్టీల్ ప్లాంట్ నుంచి 10 శాతం, 20 శాతం షేర్లు ఉపసంహరించాలని నిర్ణయించాయి. కార్మిక సంఘాలు ఆందోళన, కొన్ని సార్లు, మార్కెట్‌లో సరైన ధర రాకపోవడం వల్ల ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ.. దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’ సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తూ స్టీల్ ప్లాంట్ భూమిలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుకు ఎంవోయూ చేసింది.
దానిపై ఆందోళన కొనసాగుతుండగానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) స్ట్రాటజికల్ సేల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్లాంట్ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థలను వ్యూహాత్మక అమ్మకంలో చేర్చాలా, ప్రత్యేకంగా ఉంచాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పగించారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీ వేసినట్టు స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. కమిటీ కూడా ఆమోదం తెలిపితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
స్టీల్‌ప్లాంట్‌లో కన్వేయర్ బెల్టుల దగ్ధం
స్టీల్‌ప్లాంట్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్‌ఎంహెచ్‌పీ) విభాగంలో గురువారం రెండు కన్వేయర్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వల్ల ఉత్పత్తికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. విభాగంలోని 67వ నంబర్ కన్వేయర్‌కు గురువారం ఉదయం షట్‌డౌన్ పనులు చేస్తున్నారు. పనులు చేస్తుండగా అక్కడ బెల్టుకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆ పక్కనే ఉన్న 66వ కన్వేయర్‌కు అంటుకున్నాయి. వెంటనే సీఐఎస్‌ఎఫ్ ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 150 మీటర్ల బెల్టు దగ్ధం కావడంతో పాటు చూట్ సెన్సార్లు, బెల్ట్ స్కేల్స్ కూడా కాలిపోయాయి. దీంతో 67వ నంబర్ కన్వేయర్ ద్వారా సింటర్ ప్లాంట్‌కు ముడిపదార్థాల రవాణా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. రాత్రి షి‹ఫ్ట్ట్‌కల్లా పునరుద్ధరణ పనులవుతాయని అధికార వర్గాల సమాచారం.
ఎంతటి ఆందోళనకైనా సిద్ధం
స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని కేంద్రం చేస్తున్న కుట్రను అడ్డుకుంటాం. ఇందుకోసం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నాం. ఈ అంశంపై ఎంతటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నాం.
–జె.అయోధ్యరామ్, గుర్తింపు సంఘం అధ్యక్షుడు
త్యాగాలను వృథా కానివ్వం..
ఎంతో మంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. వారి త్యాగాలను వృథా కానివ్వం. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.
– డి.ఆదినారాయణ, స్టీల్ ప్లాంట్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తాం
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ప్రజాప్రతినిధులను కలిసి, వారి మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. దివంగత సీఎం వైఎస్సార్ వల్లే ప్లాంట్ నిలిచింది.
– వై.మస్తానప్ప, స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment