రాజీవ్‌నగర్ మురికివాడ
సాక్షి, విశాఖపట్నం : నగరం దశ దిశ మార్చుకుంటూ ముందుకెళ్తున్నా మధ్యలో అక్కడక్కడా అభివృద్ధికి దూరంగా విసిరిపడేసినట్లుండే మురికివాడలను పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. చుట్టూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా వారి దరికి మాత్రం అవి చేరలేదు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. మొత్తం 793 మురికివాడల్లో నివసించే ప్రజలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సర్వేతో పాటు మ్యాపింగ్ చేసేందుకు జీవీఎంసీ 793 బృందాలతో రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వేకు సిద్ధమవుతోంది.
జీవీఎంసీ పరిధిలో 2005 ముందు వరకూ 450 మురికివాడలుండేవి. ఆ తర్వాత భీమిలి, గాజువాక అనకాపల్లి విలీనం చేయడంతో 2013 నాటికి ఈ సంఖ్య 793కి చేరింది. గత ప్రభుత్వాలు ఈ మురికి వాడల అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై ఏ ఒక్కరోజూ ఆలోచన చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం స్లమ్స్‌ను అభివృద్ధి చేయాలని, అందులో ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రజలకు పట్టాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి స్లమ్‌లెస్ సిటీగా విశాఖను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
426 నోటిఫైడ్ స్లమ్స్....
నగర పరిధిలో మొత్తం 426 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా 367 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. వీటిలో 20వేల వరకూ గృహాలున్నాయని, లక్ష వరకూ జనాభా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మురికివాడలు వివిధ రకాల భూముల్లో అభివృద్ధి చెందాయి. జీవీఎంసీకి చెందిన 67 స్థలాల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన స్థలాల్లో 563, కేంద్ర ప్రభుత్వం, అనుబంధ సంస్థలకు చెందిన స్థలాల్లో 10, ప్రైవేట్ భూముల్లో 153 మురికి వాడలు ఏర్పడ్డాయి. ఈ మురికి వాడలు ఎంత మేర విస్తీర్ణంలో ఉన్నాయన్న అంశాలను గణించనున్నారు.
రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వే
మురికివాడలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజలకు సొంత ఇంటి పట్టాల్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఈ నెల 11, 12 తేదీల్లో 793 మురికి వాడల్లో జీవీఎంసీ యూసీడీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించనుంది. ఒక్కో స్లమ్‌కు ఒక్కో బృందం చొప్పున 793 బృందాలను యూసీడీ పీడీ వై.శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటారు. ఇందుకోసం జోనల్ కమిషనర్లు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఇంజినీరింగ్ సిబ్బంది, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, వీఆర్వోలు మొత్తం 3,965 మంది సర్వే నిర్వహించనున్నారు. సరిహద్దులు, ఒక్కో స్లమ్‌లో ఉన్న జనాభా, ఇళ్లు, స్థల స్వరూపం, స్లమ్ మ్యాపింగ్ మొదలైన అంశాలను సేకరించనున్నారు. ఈ సర్వే ఆధారంగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment