సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టంచేశారు.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది.
హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు
ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ఎంఎస్ అప్లికేషన్, లాగిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో హాజరు డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది.
డ్యాష్‌బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఎంఎస్ అప్లికేషన్‌లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ ఆధికారులు అప్‌లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్‌జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
Published Tue, Oct 26 2021 3:39 AM | Last Updated on Tue, Oct 26 2021 1:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment