
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 59,778 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 545.3 అడుగులకు చేరింది. మూసీ ప్రవాహంతో సాగర్‌కు దిగువన కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. పులిచింతలకు 10,400 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి పాలేరు, కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 42,025 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ.. 36,750 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలంలోకి వరద ప్రవాహం మరింత తగ్గింది. ప్రాజెక్టులోకి 58,264 క్యూసెక్కులు చేరుతుండటంతో ఒక గేటును మూసివేశారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 59,317 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.6 అడుగుల్లో 196.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కృష్ణా బేసిన్‌లో ఎగువన వర్షాలు తెరిపి ఇచ్చాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి ప్రవాహం తగ్గిపోవడంతో వాటి గేట్లు మూసేశారు. విద్యుదుత్పత్తిని కూడా నిలిపేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రం 28,196 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. మంగళవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింతగా తగ్గనుంది.