రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
ఆయన గురువారం సచివాలయంలో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో యువతకు ఉపాధి
రాష్ట్ర చిన్న, మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు పారిశ్రామికంగా ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామని వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 20 ఆదర్శ మండలాలకు రూ.10లక్షలు చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.
బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్
రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించనున్నట్టు బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకంపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు.
వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్టు సవిత తెలిపారు. 2014–19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్‌ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడో బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment