రాష్ట్రంలో చట్టం టీడీపీ వారికి ఒకలా.. వైఎస్సార్‌సీపీ వారికి ఒకలా అన్నట్లుగా ఉంది
లోకేశ్, అయ్యన్నపాత్రుడు ప్రోద్బలంతో మాపై అసభ్యంగా పోస్టులు పెట్టారు
వీటిన్నింటిపై గతనెల 19న ఫిర్యాదు చేశాం: అంబటి రాంబాబు
పోలీసులు చర్యలు తీసుకోకపోతే నిరసన చేపడతాం.. చట్టబద్ధంగా పోరాడుతాం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్‌సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
కేసు నమోదు చేయాలి..
‘బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన 14 రోజుల్లో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిని తప్పుడు ఫిర్యాదు అని ధ్రువీకరించాల్సి ఉంటుంది. కానీ, గుంటూరు పోలిసులు మా ఫిర్యాదులపై ఎలాంటి కేసులు నమోదుచేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారు. జిల్లా ఎస్పీని కలిసి కిందిస్థాయి పోలీస్ సిబ్బంది మా ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. మీరైన చర్యలు తీసుకోవాలని కోరాం.
ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదుచేస్తే దర్శకులు రాంగోపాల్‌వర్మ, పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపైనా కేసులు నమోదుచేసి వారిని జైళ్లల్లో కూడా పెట్టారు. మాజీ మంత్రిని అయిన నేను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదు? దీనిపై కోర్టులను ఆశ్రయిస్తాం. పోలీసుల తీరును వ్యవస్థలు గమనించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం.
ఈ నిరసన స్థానిక పోలీసుస్టేషన్ల వద్దగాని, ఎస్పీ కార్యాలయం వద్దగాని, డీజీపీ కార్యాలయం వద్దగాని ఉంటుంది. పోలీసులు మా ఫిర్యాదులపై స్పందించకపోతే మా ముఖ్య నాయకులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన తెలియజేస్తాం. అలాగే, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం’ అని అంబటి చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సీడీ భగవాన్, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment