చిలకలపూడి(మచిలీపట్నం) : బందరు పోర్టు నిర్మాణ పనులు నిరంతరాయంగా శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల పరిధిలో జరుగుతున్న పోర్టు పనులను గురువారం ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొందరు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ దేవుడు సీఎం జగన్ రూపంలో పంపి పోర్టు నిర్మాణ పనులు జరిగేలా చేస్తున్నారని చెప్పారు. ఏడు నెలలుగా నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయని, పోర్టుకు వచ్చేందుకు పక్కా రహదారి నిర్మాణం జరుగుతోందని ఇందుకోసం 90 శాతం భూమిని కూడా సేకరించినట్టు చెప్పారు.
మిగిలిన భూమి మరో నెల రోజుల్లో సేకరించనున్నట్టు తెలిపారు. మెఘా ఇంజనీరింగ్ సంస్థ 25 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతోందన్నారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేసి జనవరి నుంచి డ్రెడ్జింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోర్టు నిర్మాణాన్ని ఆరు నెలలు ముందుగానే పూర్తి చేసేలా మొక్కవోని దీక్షతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. నిర్మాణం ఆగకుండా, బిల్లులు పెండింగ్ లేకుండా సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ఉన్నారని వివరించారు.
గతంలో పచ్చ పార్టీ పోర్టు పనుల ప్రారంభ నాటకం
గతంలో చంద్రబాబు ప్రజలను మోసగించేలా పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నాని గుర్తుచేశారు. నిర్లజ్జగా బరితెగించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయకుండా చివరిలో రైతు భూమిలో శంకుస్థాపన చేసి రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 22 గ్రామాల్లో 33 వేల ఎకరాలు బలవంతపు భూసేకరణ చేసేందుకు ప్రయత్నించారని, అనుమతులు, నిధుల్లేకుండా శంకుస్థాపన రాళ్లు వేసి ప్రజలను మోసగించారని గుర్తుచేశారు.
మూలపేట పోర్టుతో శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ
టెక్కలి: రాష్ట్రంలోని తీరప్రాంతంలో రూ.16వేల కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్టు వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట తీరంలో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ఉన్న 5 పోర్టులతో పాటు అదనంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ఈ నిర్మాణాలు పూర్తయితే సుమారు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 320 మిలియన్ టన్నుల మేరకు ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి మూలపేట పోర్టు నుంచి షిప్ ట్రయల్ రన్ చేయనున్నట్టు చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ 2025 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు తిరిగేలా చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు.
రానున్న రోజుల్లో మూలపేట ప్రాంతం విశాఖతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయన్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 14 ఏళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment