నరసాపురం రూరల్/ కొయ్యలగూడెం: అనారోగ్యంతోనో, ప్రమాదానికి గురవడం వల్లో వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన లబ్ధిదారులకు వారివద్దకే వెళ్లి పింఛన్ల సొమ్ము అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పలువురు వలంటీర్లు. మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కట్టా కనకరాజు కల్లుగీత కార్మికుడు. ఇటీవల కల్లుగీతకు చెట్టెక్కి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుకు స్థానిక వలంటీర్ గెద్దాడ శివకృష్ణ శుక్రవారం ఆస్పత్రికే వెళ్లి గీత కార్మిక పింఛను సొమ్ము అందజేశాడు.
కష్టంలో ఉండగా అందించిన సొమ్ము తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగరాజు సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే కొయ్యలగూడెం మండలం పరింపూడి–2 సచివాలయ ఉద్యోగి సిరాజు తాను సైతం అంటూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లి పింఛను అందజేశాడు. పరింపూడికి చెందిన గాలంకి వెంకటేశం అనే వృద్ధుడు దేవరపల్లి వెళ్లి టైఫాయిడ్ జ్వరం వల్ల అక్కడే ఉండిపోయాడు. స్థానిక వలంటీర్ సెలవుపై ఉండటంతో వెంకటేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సిరాజు శుక్రవారం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశాడు. ఈ సందర్భంగా సిరాజును ఎంపీడీవో కేఆర్‌ఎస్ కృష్ణప్రసాద్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment