మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధం చేసింది. తద్వారా పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి బీజం వేస్తోంది. పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది.
సాక్షి, నెల్లూరు: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది.
వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్‌లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసÆమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జిల్లాలో రెండు చోట్ల
జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల మహిళా మార్ట్‌లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో చర్యలు వేగవంతమయ్యాయి. జిల్లాలో తొలుత ఐదు మండలాలను ఎంపిక చేశారు. కావలి, వెంకటాచలం, కోవూరు, వింజమూరు, కందుకూరు వంటి ప్రాంతాలను ఎంపిక చేసి అందులో రెండు చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా సంఘాల ఎంపిక, స్థల సేకరణ, పెట్టుబడి నిధి సమీకరణ, వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్త్రీనిధి, బ్యాంక్ రుణంతో..
సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన వాహన పార్కింగ్ ఉండేలా బ్యాంకులు, బస్సు స్టేషన్ సమీపంలో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ మార్ట్‌ల్లో స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయనున్నారు. సుమారు రూ.60 లక్షల వరకు మూలధనంగా సమీకరించనున్నారు. స్వయం సహయక సంఘాల మహిళలను ఈ మార్ట్‌ల్లో వాటాదారులుగా చేర్చనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మహిళలు ఇష్టపడితే ప్రతి ఒక్కరి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వాటా ధనం సేకరిస్తారు. బ్యాంకుల నుంచి, స్త్రీ నిధి అప్పుల రూపంలో సేకరిస్తారు
మార్ట్ సేవలు ఇలా..
మహిళా మార్ట్‌ల ఏర్పాటుతో గ్రామీణ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనవసర వ్యయం, రవాణా ఖర్చు తగ్గించేలా దృష్టి పెడతారు. హోల్ సేల్ విక్రయాల ద్వారా తక్కువ ధరలకు సరుకుల లభ్యత ఉండేలా చూస్తారు. స్థానిక రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ మధ్యవర్తిగా వ్యవహరించి వారికి మద్దతు ధర లభించేలా చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం వంటివి మార్ట్‌లు చేపట్టనున్నాయి.
మహిళా సంఘాలు బలోపేతం
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలు మరింత బలోపేతం అయ్యేందుకు మహిళా మార్ట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థల సేకరణ, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై సమీక్ష నిర్వహించాం. వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్ల మాదిరిగానే మార్ట్‌లు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలో మార్ట్‌లు కార్యరూపం దాల్చనున్నాయి.
– సాంబశివారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment