తన తండ్రి సంస్మరణ సభలో మాట్లాడుతున్న వైఎస్ భారతి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి కడప: ‘నాన్న వెరీ వెరీ సింపుల్ పర్సన్. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి చనిపోయే పరిస్థితిలో ఉన్న చిన్నారులను కూడా బతికించేవారు. ఎక్కడా బాగు కాని కేసులు వచ్చేవి. వారందరినీ బతికించి, అందరి హృదయాలలో నాన్న చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు’ అని ఆయన కుమార్తె, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ భారతితోపాటు పలువురు డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని వైఎస్ భారతి ఇలా గుర్తు చేసుకున్నారు.
చెట్ల కింద ఉండి చూపించుకుని పోయేవాళ్లు
► ‘మేము పులివెందులలో పాత ఆసుపత్రి మేడపైన ఉన్నప్పుడు కింద ఎవరైనా చిన్నపిల్లలు ఏడ్చినా.. ఏదైనా అరుపు వినిపించినా నాన్న వెంటనే ఫోన్ చేసి అక్కడి సిస్టర్లకు చెప్పేవారు. ఎన్నోసార్లు నేను చూశాను. చివరకు పైనుంచి కిందకు దిగివెళ్లి ఏడుస్తున్న బాబు తల్లిదండ్రులతో మాట్లాడేవారు.
► ఆస్పత్రిలో బెడ్స్ లేవన్నా.. నాన్న హస్తవాసి మంచిదని, చెట్ల కింద మంచాలు వేసుకుని చూపించుకుని పోయిన వాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. పేదలు, వికలాంగులతో ప్రత్యేకంగా మాట్లాడేవారు. వారికి వైద్యం అందించడమే కాకుండా వ్యక్తిగత ఇబ్బందులు తీర్చేవారు.
► విద్యార్థులు, గల్ఫ్ దేశాలలో ఉన్న ముస్లిం కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా వైద్యం అందించేవారు. ఎందుకంటే గల్ఫ్‌లో ఉంటున్న వారి కష్టాలు, విద్యార్థులు, దివ్యాంగుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి.
చిన్న పిల్లల మనస్తత్వం
► చివరకు ప్రత్యర్థులను కూడా ప్రేమతో చూస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించిన మంచి మనిషి నాన్న. అక్కడ ఉన్న చిన్నపిల్లలను చూసి హర్షమ్మ, వర్షమ్మ అని పిలుచుకునే గొప్ప మనస్తత్వం ఆయనది. 40 ఏళ్ల పాటు ఆయన్ను చూశాను. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించేవారు. సీరియస్‌గా ఉండేవారు కాదు.
► అత్యవసరంగా ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినా చికిత్స అందించిన తర్వాతే ముందుకు అడుగు వేసేవారు. మూగ, చెవిటి, వికలాంగులను ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు. ఇంట్లోకి వెళ్లండి.. భారతమ్మ, దినేష్‌లను కలవండి.. అని చెప్పి పంపేవారు.
► పేషెంట్లను చూస్తున్నప్పుడు నాన్న వెంట అమ్మ ఉండేది. నాన్న చనిపోయాక చూడటానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, దివ్యాంగులే. నాన్నది సున్నిత మనస్తత్వం. తొందరగా బాధ పడతారు.. అంతే తొందరగా సంతోష పడతారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల మనస్తత్వం’ అని వైఎస్ భారతి గుర్తు చేసుకున్నారు.
► ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు, అభిమానులు, సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ఈసీ సుగుణమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం పులివెందులకు వచ్చారు. స్థానిక వైఎస్సార్ ఆడిటోరియం ఆవరణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్ర పటం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
► ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గౌతమి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment