విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు జననీరాజనం
గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టిన యాత్ర
దుర్గమ్మ నీడలో కృష్ణమ్మ సాక్షిగా కిక్కిరిసిన కనకదుర్గమ్మ వారధి
వీడ్కోలు పలికిన గుంటూరు జిల్లా వాసులు
గుండెల నిండా ప్రేమను నింపుకుని స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా నేతలు.. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం జగన్.. అడుగడుగునా
హారతులు పట్టిన అక్కచెల్లెమ్మలు
మండుటెండను.. జోరు వాననూ లెక్కచేయకుండా వెంట నడిచిన యువత
చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు
(మేమంతా సిద్ధం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఆకాశం నిప్పులు చిమ్మినా.. మేఘాలకు చిల్లులు పడినా.. నీపై మా అభిమానం తగ్గదు అన్నా.. నింగి, నేల ఉన్నంతకాలం నీతోనే మేమంతా జగనన్నా.. అంటూ సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు ప్రజల ఘాటైన ప్రేమాభిమానాలను గుండెల నిండా నింపుకుని.. ఎన్టీఆర్ జిల్లా వాసుల ఆప్యాయతలను పంచుకోవడానికి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రెండు జిల్లాలనూ కలిపే కనకదుర్గ వారధి జన ప్రవాహంతో పోటెత్తింది. అడుగుతీసి అడుగువేయలేనంతగా ప్రజలతో నిండిపోయింది.
గుండెల్లో నింపుకున్న గుంటూరు..
గుంటూరు జిల్లా నంబూరు బైపాస్‌లో రాత్రి బస వద్ద మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్‌ను కలిశారు. పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ సీఎం జగన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉ.10.13 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత రాక కోసం అప్పటికే జాతీయ రహదారి అభిమానులతో నిండిపోయింది. రహదారికి రెండువైపులా జగన్ రాకకోసం ప్రజలు ఉత్సాహంతో ఎదురుచూశారు.
అల్లంత దూరాన సీఎం జగన్ బస్సును చూడగానే ఒక్కసారిగా పరుగు పరుగున ఎదురెళ్లారు. జగనన్నా.. అంటూ బిగ్గరగా నినదిస్తూ.. చేతులు ఊపుతున్న అభిమానులను చూసి జగన్ ప్రతిగా అభివాదం చేశారు. దారిపొడవునా తనకు ఎదురొస్తున్న జన ప్రవాహానికి అభివాదం చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ బస్సుయాత్ర ముందుకు సాగింది. కంతేరు అడ్డరోడ్డులో అక్కడి గ్రామస్తులు జగన్‌కు గజమాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చినకాకాని వద్ద మహిళలు వైఎస్సార్‌సీపీ జెండాలతో ఎదురొచ్చారు.
వారిని చిరునవ్వుతో పలకరించి కాజా టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. స్థానికులు భారీ గజమాలతో జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిచ్చిన ఆప్యాయతను అందుకుని ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ మీదుగా మంగళగిరి చేరుకున్నారు. హైవేపై బారులు తీరిన జనం జగన్‌కు జేజేలు పలికారు. వారికి అభివాదం చేస్తూ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న సీఎం అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కనకదుర్గ వారధిపై జనప్రవాహం..
ఇక గుంటూరు జిల్లా నుంచి జగన్ బస్సుయాత్ర వస్తోందని తెలిసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, పార్టీ అభిమానులు జగన్‌కు స్వాగతం పలికేందుకు కనకదుర్గ వారధిపైకి భారీగా తరలివచ్చారు. వర్షంలోనే గుంటూరు జిల్లా ఘనంగా వీడ్కోలు పలుకగా, ఎన్టీఆర్ జిల్లా ఆత్మీయంగా స్వాగతం చెప్పింది. దుర్గమ్మ నీడలో.. కృష్ణమ్మ సాక్షిగా.. కనకదుర్గ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇదే వారధిపై పాదయాత్ర చేసిన రోజులను ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకున్నారు. విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు వెంటరాగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సా.5.38 గంటలకు వారధి దాటింది.
విజయవాడలో జనజాతర..
నగర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా అభిమాన నాయకుడి ఆగమనంతో విజయవాడ నగరం జన జాతరను తలపించింది. మహిళలు, చిన్నారుల కోలాటాలు, స్టిక్ వాకర్స్, డప్పులు, వాయిద్యాలు, బటర్‌ఫ్లై వేషధారణలు, శక్తి వేషాలు, కేరళ సంప్రదాయ నృత్యాలు, బాణాసంచా కాంతులు, డీజే సౌండ్లు, భారీ గజమాలలు, జగన్ నిలువెత్తు కటౌట్లు.. ఇలా ఒకటేమిటి.. దారిపొడవునా కోలాహలం కనిపించింది. వారధి దాటిన దగ్గర్నుంచీ అభిమానులు పోటెత్తడంతో బస్సుయాత్ర ముందుకు కదలడమే కష్టమైంది. అడుగడుగునా పూలవర్షం కురిపించారు.
భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. కృష్ణలంక సాయిబాబా గుడి నుంచి ప్రతిదారీ ప్రజాభిమానంతో కిక్కిరిసిపోయింది. యాత్ర బందరు రోడ్డు రమేష్ ఆస్పత్రి సెంటర్ నుంచి శిఖామణి సెంటర్‌కు చేరుకోగానే అత్యంత భారీ గజమాలతో అభిమానులు జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెట్రో సెంటర్, చుట్టుగుంట, రోకళ్లపాలెం, సత్యనారాయణపురం, సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్ వరకూ ఇసుకేస్తే రాలనంత జనం బస్సుయాత్ర వెంట నడిచారు. సింగ్‌నగర్ వంతెనపైకి చేరుకోగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు.
ప్రజల మధ్య భారతమ్మ..
శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తాడేపల్లి జంక్షన్‌కు చేరుకున్న బస్సుయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ బస్సుయాత్రగా వస్తున్న సీఎం జగన్‌కు రోడ్డుపై నిలబడి అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య తానూ ఓ సామాన్యురాలిగా చిరునవ్వుతో జగన్‌కు చేతులు ఊపారు. ప్రతిగా సీఎం జగన్ కూడా బస్సులో నుంచే భారతికి అభివాదం చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. అనంతరం మణిపాల్ ఆసుపత్రి జంక్షన్‌కు భారీగా చేరుకున్న అభిమానులు మళ్లీ రా.. అన్నా అంటూ వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment