సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఈనెల 24న ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించి రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలపై గళమెత్తాలని పార్టీ నిర్ణయించింది.
ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటో గ్యాలరీ ఏర్పాటుచేయడంతో పాటు వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరామని.. లోక్‌సభ, రాజ్యసభలోనూ పెద్దఎత్తున తమ పార్టీ వాణి వినిపిస్తామని వారు తెలిపారు.
నేడు ఢిల్లీకి జగన్..
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉ.9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తారు. మూడ్రోజులపాటు అక్కడే ఉంటారు. ఈనెల 24న ధర్నాలో పాల్గొంటారు. ఇక ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వనించారు.
Comments
Please login to add a commentAdd a comment